నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో వైరాలజీ ల్యాబ్

by Shyam |
నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో వైరాలజీ ల్యాబ్
X

దిశ, నిజామాబాద్ :
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కోవిడ్-19 పరీక్షలు స్థానికంగా నిర్వహించేందుకు వీలుగా వైరాలజీ ల్యాబ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా పరీక్షల కోసం ప్రభుత్వం పంపించిన ఎక్విప్మెంట్ వచ్చిందని, ల్యాబ్ ఏర్పాటు కూడా చేసినట్టు వివరించారు. మొదటగా నమూనా పరీక్షలు చేసి హైదరాబాద్ పంపించాక.. వారి ఆమోదం అనంతరం ల్యాబ్‌లో రోజుకు 300 నుంచి 500 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించవచ్చునని చెప్పారు. ప్రస్తుతం కరోనా పేషెంట్ల కోసం 200 పడకల హాస్పిటల్ సిద్ధంగా ఉందని, మార్చి నెలలో మంజూరు చేసిన ఐదు గదులు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆ హాస్పిటల్‌లో 15 వెంటిలేటర్లు కూడా ఉన్నాయని, వీటిలో 10 కోవిడ్ పేషెంట్ల కొరకు, 5 ఇతర పేషెంట్లకు కేటాయించినట్టు తెలిపారు.అంతే కాక 80 మందికి ఆక్సిజన్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నదని, ఆరోగ్య శాఖ మరో 15 వెంటిలేటర్లను కేటాయించనుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్ భవనంలో ఉన్న గైనకాలజీ విభాగాన్ని ఎదురుగా ఉన్న ఎంసీహెచ్ భవనంలోకి వెంటనే మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ భవనంలో అవసరమైన జెనరేటర్, సీసీ కెమెరాలు, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు సీసీయంఐడీసీ ద్వారా వెంటనే చేయించి వారంలో షిఫ్ట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ అయిన జనరల్ హాస్పిటల్‌ అంతస్తులు కొవిడ్ హాస్పిటల్‌కు కలిపి 400 నుంచి 500పడకలుగా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట హాస్పిటల్ సూపరిండెంట్ ఎం.నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్, టీ ఎస్‌ఎం‌ఎస్‌డీసీ ఈఈ చంద్రశేఖర్ సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed