బీసీసీఐలో మళ్లీ వివాదం.. కోహ్లీపై ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ ఆరోపణ

by Shyam |
బీసీసీఐలో మళ్లీ వివాదం.. కోహ్లీపై ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ ఆరోపణ
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్‌లో ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు’ (కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ద్రవిడ్, కపిల్ దేవ్‌పై ఇలాంటి ఫిర్యాదు చేసిన వ్యక్తే తాజాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్ 38(4)ను కోహ్లీ ఉల్లంఘించాడని ఆరోపిస్తూ ఎథిక్స్ అధికారికి లిఖిత పూర్వక ఫిర్యాదు అందింది. జూలై 4న తనకు ఈ ఫిర్యాదు అందినట్లు ఎథిక్స్ అధికారి డీకే జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్నట్లు తెలిపారు.

ఏమిటీ రూల్..?

జస్టీస్ లోథా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐకి నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగంలోని రూల్ నెంబర్ 38(4) ప్రకారం, ఏ వ్యక్తి, ఆటగాడు ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు’ కలిగి ఉండకూడదు. అంటే బోర్డును, ఆటను ప్రభావితం చేసి ప్రయోజనాలు పొందగలిగే రెండు హోదాల్లో ఉండకూడదు. ఇది తెలిసి చేసినా, తెలియక చేసినా నేరమే. ముందుగా ఒక హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో సదరు వ్యక్తి ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అతడిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.

కోహ్లీపై ఆరోపణ ఏంటి?

విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండు పదవుల్లో ఉన్నాడని అది ఆటపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉంటూ మరోవైపు ఒక స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్ల వాణిజ్య వ్యవహారాలు చూస్తోందని అన్నాడు. దీని ద్వారా తన కంపెనీ కాంట్రాక్టు పరిధిలో ఉండే ఆటగాళ్లకు కెప్టెన్‌గా ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని ఆరోపిస్తున్నారు. ఇది బీసీసీఐ రూల్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్ఎల్‌పీ, కార్నర్ స్టోన్ వెంచర్స్ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీలో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ రెండు కంపెనీల్లోని డైరెక్టర్లే కార్నర్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కూడా డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థే భారత క్రికెటర్ల వ్యాపార లావదేవీలను నిర్వహిస్తోంది. ఈ మేరకు వారితో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇది కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పిదమని, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా జత చేసి బీసీసీఐ ఎథిక్స్ అధికారికి పిర్యాదు చేశారు.

అప్పట్లో కపిల్ , ద్రవిడ్

గతంలో కూడా పలువురు భారత మాజీ క్రికెటర్లపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద ఫిర్యాదులు చేశారు. కపిల్ దేవ్ భారత క్రికెటర్ల సంఘంలో సభ్యుడిగా, ఒక ఫ్లడ్‌లైట్స్ సంస్థ అధినేతగా, క్రికెట్ వ్యాఖ్యాతగా ఉంటూనే క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్నారనే పిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయన సీఏసీ పదవికి రాజీనామా చేశారు. అలాగే, ద్రవిడ్ కూడా క్రికెట్ డైరెక్టర్‌గా ఉంటూ సీఏసీ పదవిలో ఉన్నారని ఫిర్యాదు అందడంతో ఆయన కూడా సీఏసీకి రాజీనామా చేశారు. అసలు కేవలం ఒక సలహా కమిటీలో ఉండటం వల్ల పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఏముంటాయని ఆనాడే సౌరవ్ గంగూలీ తీవ్రంగా మండిపడ్డారు. బీసీసీఐ నాశనం అయిపోతున్నదని, ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదుల వల్ల మాజీ ఆటగాళ్లు క్రికెట్‌లో భాగం కావడానికి ముందుకు రారని అన్నాడు. మరి ఇప్పుడు గంగూలీనే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. కోహ్లీ విషయంలో ఏ నిర్ణయం తీసకుంటాడో తెలియాలి.

అతడో ఫిర్యాదుల పుట్ట

బీసీసీఐ అధికారులు, ఆఫీస్ బేరర్లు, ఆటగాళ్లపై ఎప్పుడూ ఫిర్యాదు చేసే వ్యక్తి ఒకరే. ఆయనే మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సంజీవ్ గుప్తా. గతంలో ద్రవిడ్, గంగూలీ, కపిల్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండుల్కర్ వంటి వారిపై ఫిర్యాదులు చేశాడు. దీంతో వాళ్లందరూ ముందుగానే తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీద పిర్యాదు చేసింది కూడా సంజీవ్ గుప్తానే. కోహ్లీపై ఫిర్యాదుకు తగిన ఆధారాలు కూడా సమర్పించి, బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉటంకించడంతో, కోహ్లీకి ఇప్పుడు రెండింటిలో ఏదో ఒక పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఎదురైంది.

Advertisement

Next Story

Most Viewed