కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయండి: వినోద్ కుమార్

by Shyam |
కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయండి: వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయిన‌పల్లి వినోద్ కుమార్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రికి ఆదివారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని 35కేంద్రీయ విద్యాలయాల్లోని టీచర్స్ పోస్టుల ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం కలిగించాలని ఆయన లేఖలో కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని, టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేవీల్లో మొత్తం 1,218 టీచర్స్ పోస్టుల మంజూరుకాగా.. 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2014-19 కాలంలో తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు పలుమార్లు కేవీలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన సందర్బంలోనూ విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని గమనించానని వినోద్ కుమార్ ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులతో పాటు కాంట్రాక్టు టీచర్స్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిన వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్‌ ప్రతిపాదనలను మంజూరు చేయాలని లేఖలో కోరారు.

Advertisement

Next Story