ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో PMO జోక్యం తగదు : వినోద్ ఫైర్

by Sridhar Babu |
Vinod kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్వతంత్రంగా పనిచేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారాల్లో ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు జోక్యం చేసుకోడాన్ని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తప్పుపట్టారు. స్వతంత్ర సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, పీఎంఓ అధికారులు ఇటీవల ఎలక్షన్ కమిషనర్లతో రహస్యంగా సమావేశం కావడం దురదృష్టకరమని అన్నారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్‌పై కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఇలాంటి పెత్తనం చేయడం శ్రేయస్కరం కాదన్నారు. మన దేశ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, అనేక దేశాలు ఇక్కడికి వచ్చి పని తీరును అధ్యయనం చేస్తూ ఉన్నాయని, స్వతంత్రంగా పనిచేయడాన్ని కొనియాడాయని, ఇలాంటి పరిస్థితుల్లో పీఎంఓ అధికారుల జోక్యం సంస్థను నిర్వీర్యం చేయడమేగాక ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేయడమని వ్యాఖ్యానించారు.

సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను మోడీ ప్రభుత్వం తన కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను అందరూ నిరసించాలని పిలుపునిచ్చారు. ఈసీ స్వతంత్రంగా పని చేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. అనేక రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ నిర్వహించే సమావేశాలకు గత ఇరవై ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను హాజరయ్యాయనని, బీజేపీ ప్రతినిధులు సైతం ఇదే తీరులో హాజరై వారి అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఉందని నొక్కిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed