తెలంగాణలో పబ్లిక్ స్వచ్ఛంద లాక్‌డౌన్

by Anukaran |
Villages in Telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో: పల్లెలన్నీ గిరిగీసుకుంటున్నాయి. ఎవరితోనూ సంబంధం లేకుండా పల్లె జనాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దుకాణ సముదాయాలు, మార్కెట్ల కార్యాకలపాలు, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఊహించ‌ని విధంగా వైరస్‌ వ్యాప్తి పెరిగుతోంది. సెకండ్ వేవ్‌లో కరోనా సైలెంట్‌గా రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. నిన్నమొన్నటి వ‌ర‌కు ప‌ట్టణ ప్రాంతాల్లో మాత్రమే కేసులు నమోదుకాగా… ఇప్పుడు ప‌ల్లెల్లోకి చొచ్చుకొచ్చింది. అటు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి నివారణ చర్యలు లేవని భావించి స్వచ్ఛంద లాక్ డౌన్​ పాటిస్తున్నాయి.

మధ్యాహ్నం 12 దాటితే మూసివేయాల్సిందే

మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పాలకవర్గాలు లాక్​డౌన్​కు తీర్మానం చేసుకుంటున్నాయి. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తూ ఆంక్షలు విధిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపారాలకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి మరునాడు తెల్లవారుజాము 5 గంటల వరకు లాక్​డౌన్​ విధించుకుంటున్నారు. కరోనా మొదటివేవ్​లో ప్రభుత్వం దీన్ని పాటించగా… ఇప్పుడు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు. ఎవరైనా మాస్క్ లేకుండా తిరిగితే ఫోటోలు తీసి పోలీసులకు పంపిస్తున్నారు. ఆంక్షలను విస్మరిస్తే జరిమానాలు విధిస్తున్నారు. దుకాణం తెరిచినా.. మాస్క్​ లేకుండా తిరిగినా జరిమానా విధిస్తున్నారు. ఇది జరిమానాల కోసం కాదని… స్వీయ నియంత్రణలో భాగమంటూ అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో వైద్యపరమైన దుకాణాలు తప్ప మరే ఇతర సముదాయాలు తెరిచి ఉంచరాదంటూ ఆంక్షలు విధించారు.

కరోనా రక్కసిని తరిమేందుకే…!

కరోనా రక్కసిని తరిమేందుకు స్వచ్ఛంద లాక్‌ డౌన్‌ పాశుపతాస్త్రంగా పనిచేస్తోందని పల్లె జనం నమ్ముతోంది. పల్లెల్లో లాక్‌డౌన్‌తో కొన్నిచోట్ల పట్టణాల్లోనూ మొదలైంది. పట్టణాల్లో కూడా దుకాణాలు అన్నింటిని మధ్యాహ్నం ఒంటి గంట వరకే క్లోజ్‌ చేస్తున్నారు. మరోవైపు పంచాయతీలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో అన్ని వర్గాలు లాక్​డౌన్​కు కలిసి వస్తున్నాయి. కొన్నిచోట్ల గ్రామాల్లోని యువకులే లాక్​డౌన్​ అమలు బాధ్యతలను భుజాలపై వేసుకుంటున్నారు. అనవసరంగా బయటకు వస్తే తిప్పి పంపుతున్నారు.

మరేం చేయాలి..?

గ్రామాల్లో కరోనా విలయం నెలకొనడంతో… స్వచ్ఛంద లాక్​డౌన్​ వైపు వెళ్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులను సైతం నిలిపివేస్తున్నారు. రోజు విడిచి రోజు పనులు చేస్తున్నారు. ఇప్పుడు బతికి ఉంటే చాలు అనే పరిస్థితుల్లో ఉన్నామని, ఇలాంటి సమయంలో స్వీయ రక్షణ తప్పదంటున్నారు. ఇప్పటికే పల్లెల్లో చాలా మరణాలు నమోదయ్యాయి. దీంతో గ్రామాల సరిహద్దుల నుంచే ఆంక్షలు పెట్టుకుంటున్నారు. అటు గ్రామాల నుంచి వలస వెళ్లినవారు రావాలంటే పరీక్షలు నిర్వహించుకుని రావాలంటున్నారు. వచ్చినా వారిని 15 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచుతున్నారు. కొన్ని గ్రామాలైతే సాయంత్రం 5 దాటితే రాకపోకలను నిలిపివేస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా కొనసాగుతోంది. పల్లెల్లో మోగుతున్న ప్రమాద ఘంటికలు అడ్డుకునేందుకు స్వీయ నిర్బంధమే ఏకైక మార్గం అనే భావనతో పల్లెల్లోని పెద్దమనుషులు, పంచాయతీల పాలకవర్గాలు సంయుక్తంగా కట్టడాన్ని కొనసాగిస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో స్వచ్ఛంద లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అత్యవసర సేవలు తప్ప మిగతా దుకాణాలన్నీ మూసివేయాలని యాదగిరిగుట్ట పురపాలక సంఘం తీర్మానించింది. పాలకీడు, చిట్యాల, నారాయణపురం, సర్వేలు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటిస్తున్నారు. కోదాడ పట్టణంలో వ్యాపార సంస్థలు లాక్‌డౌ మండలాల్లోని పలు గ్రామాల్లో లాక్​డౌన్​ అమల్లో ఉంది. కోదాడ పట్టణంలో కూడా అంతే. మునగాల, చౌటుప్పల్​ మండల కేంద్రంలో సైతం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే ఇదే వర్తిస్తోంది.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 60 గ్రామాల‌కు పైగా సెల్ఫ్ లాక్‌డౌన్‌కు తీర్మానం చేసుకుని అమలు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆంక్ష‌లు ఉల్లంఘిస్తే రూ.1000 నుంచి రూ.5000 వ‌ర‌కు జ‌రిమానాలు విధిస్తున్నాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 28 వరకు కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి, వ‌ర్ధ‌న్న‌పేట, ఏటూరునాగారంలో పాక్షిక లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. జ‌న‌గామ, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ, న‌ర్సంపేట‌, మ‌హ‌బూబాబాద్ ప్రాంతాల్లో కూడా వ్యాపార‌, వాణిజ్య సంఘాలు మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌కే అనుమతిస్తున్నాయి.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కేసులు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 63 మండలాల్లో దాదాపు 80 శాతం గ్రామాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని దూర్షేడ్, ముగ్దుమపూర్, బొమ్మకల్, చెర్లబూత్​పూర్, కొత్తపల్లి హవేలి, రామడుగు మండలాల్లో 23 గ్రామాలు, గంగాధర మండలంలో 26 గ్రామాలు, మానకొండూరు సెగ్మెంట్​ పరిధి తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని అన్ని గ్రామాల్లో లాక్​డౌన్​ ఉంది. జగిత్యాల పరిధి మల్యాల, రాయికల్ మండలాలు, అల్లిపూర్ , బీర్​పూర్ మండలం తుంగూర్, కొడిమ్యాల మండల కేంద్రంలో గ్రామాలలో స్వీయ నిర్భందంలో ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలోని కోనారావుపేట, చందుర్థి, రుద్రంగి మండలాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరుచుకుంటున్నాయి. పెద్దపల్లి ప్రాంతంలోని సుల్తానాబాద్ పట్టణంలొ వ్యాపార, వాణిజ్య సంస్థలు మధ్యాహ్నం వరకే తెరుస్తున్నారు. గర్రేపల్లి, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని రాంపూర్​పల్లి, జూలపల్లి మండలాల్లో స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. రామగుండం 12వ డివిజన్​లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల్లో లాక్​డౌన్​ పాటిస్తున్నారు. మహేశ్వరం మున్సిపాలిటీలో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు పాలకవర్గం తీర్మానించింది. అదే విధంగా అమీర్​పేట్, కల్వకోల్, తుమ్మలూరులో సైతం తీర్మానం చేశారు. కందుకూరు మండల కేంద్రంతో పాటు కందుకూరు, కొత్తగూడలో లాక్​డౌన్​ ఉంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి. శంకరపల్లి మండలం జనవాడ, కొండకల్ తండా గ్రామాల సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేశారు. మోమిన్​పేట మండల కేంద్రంలో లాక్​డౌన్​ పాటిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోన్, మామడ, పొన్కల్, లక్ష్మణచాంద, వడ్యాల్, కనకాపూర్లలో లాక్​డౌన్​ పాటిస్తున్నారు. ఖానాపూర్ మండలం, ఖానాపూర్ మున్సిపాలిటీ, పెంబి, కడెం మండలాలు, బోథ్ మండల కేంద్రం, ఇచ్చోడ, ఆసిఫాబాద్​, బాసర, చెన్నూరు మున్సిపాలిటీ, కోటపల్లి మండలాల్లో లాక్​డౌన్​ పాటిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో పాజిటివ్​ కేసులు కొంతమేరకు తగ్గుతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల, కల్లూరు, చెన్నూరు, మధిర, పెనుబల్లి, కారేపల్లి, ఎర్రపాలెం, బోనకల్లు, ఏన్కూరు మండలాల్లో గ్రామాలు పాక్షిక లాక్​డౌన్ పాటిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని చర్ల, పినపాక, అశ్వాపురం, కరకగూడెం, ఇల్లెందు, ముల్కలపల్లి, దుమ్ముగూడెం, గుండాల, ఆళ్లపల్లి, కొత్తగూడెం, పాల్వంచలో కూడా స్వీయ రక్షణలో ఉన్నారు. ఇక చర్ల నుంచి పామేడు (ఛత్తీస్‌గఢ్)కు రాకపోకలు నివారిస్తూ పామేడు గ్రామస్థులు దారికి అడ్డంగా కంచె వేశారు.

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని బోథ్‌, నేరడిగొండ, బజార్హత్నూర్‌, భీంపూర్‌, రత్నాపూర్‌, పిప్పల్‌కోటి, కరంజి(టి) మండలాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ సరిహద్దు మండలాలు, గ్రామాల్లో ఊరు చుట్టూ ముళ్లకంచెను ఏర్పాటు చేసి కొత్త వారిని అడ్డుకుంటున్నారు. అలాగే వంతుల వారీగా ఊళ్లో గస్తీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి ఎలాంటి వాహనాలు రాకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు.

సరిహద్దులు బంద్

గ్రామాల సరిహద్దులతో పాటుగా రాష్ట్రాల సరిహద్దులను బంద్​ చేస్తున్నారు. గ్రామాల్లోకి కొత్తవారిని అనుమతించడం లేదు. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో కూడా ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలను నియంత్రిస్తున్నారు. నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని ముంబాయి, నాందెడ్‌, పుణే, బీవండి తదితర ప్రాంతాలతో సంబంధాలున్న గ్రామాల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. అటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా కృష్ణ, నారాయణపేట, దామరగిద్ద మండలాలతో పాటు జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి, అయిజ మండలాల ప్రాంతాల్లో రవాణా, రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని కృష్ణా (దేవసూగూరు), జలాల్‌పూర్‌, సింధనూరు, నందిన్నె, బల్గెరల్లో అక్కడి పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ నుంచి రాయచూర్‌కు వెళ్లాల్సిన బస్సులను కృష్ణ మండలం టైరోడ్డు వరకే పరిమితం చేశారు.

ఆలయాలు బంద్​

రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలను సైతం మూసివేస్తుననారు. భక్తులకు దర్శనాలను ఆపేశారు. దక్షిణ కాశీగా పేరోందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, జోగుళాంబ ఆలయం, యాదాద్రి నర్సింహస్వామి, మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం, కుర‌వి వీర‌భ‌ద్రస్వామి, వ‌రంగ‌ల్‌లోని భ‌ద్ర‌కాళి ఆల‌యం, కాజీపేట‌లోని శ్వేతార్క ఆల‌యాల్లో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. భక్తులను రానీయడం లేదు. కొన్ని సేవలకే పరిమితం చేస్తున్నారు. కరీంనగర్​లోని తాపాల లక్మినర్సింహస్వామి ఆలయంలో నిత్యా పూజలు మినహా, భక్తుల ప్రవేశం నిషేధించారు. కొండగట్టు ప్రత్యేక పూజలు నిలిపివేసి, సాధారణ దర్శనాలకు అనుమతినిచ్చారు. వేములవాడ ఆలయంలో కోడె మొక్కులు నిషేదించారు. పెద్దపెల్లి జిల్లాలోని ఓదెల మల్లన్న ఆలయాన్ని మూసివేశారు. అష్టాదశ శక్తిపీఠాలలో 8వ పీఠమైన అలంపూర్ జోగులాంబ దేవాలయం ఇరవై రోజుల నుండి మూతపడి ఉంది. మన్యంకొండ, పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయాలను సైతం మూసివేశారు. అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మోమిన్​పేట ఎన్కతల శనీశ్వర ఆలయం పూర్తిగా మూసివేశారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో నిత్య అన్నదానం మూసేశారు. భక్తుల దర్శనాలకు పరిమితి విధించారు. భద్రాద్రి రామాలయంలో అంతర్గత సేవలను ఉదయం 5 నుంచి 8 గంటల వరకు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed