హాం.. ఫట్.. స్వాహా.. శవానికి ప్రాణం పొసే యత్నం..

by Sumithra |
హాం.. ఫట్.. స్వాహా.. శవానికి ప్రాణం పొసే యత్నం..
X

దిశ, వెబ్ డెస్క్ : చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపుతున్న ఈ అధునాతన సమాజంలో ఇప్పటికీ కొన్ని చోట్ల మూఢనమ్మకపు నీడలు అలాగే ఉంటున్నాయి. చనిపోయిన వ్యక్తి బ్రతికిరావడం అనేది ఏ విఠలాచార్య సినిమాలోనో చూసుంటాం. కానీ మేము కూడా చనిపోయిన వారిని బతికిస్తామని ఓ వ్యక్తి మృతదేహానికి పూజలు చేసి విఫలయత్నం చేశారు ఓ గ్రామస్తులు. చివరికి పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది.

ఎక్కడ అనుకుంటున్నారా..

ఒడిశాలోని నయగర్ జిల్లా సరంకుల్ తాలూకాలోని బరసహి గ్రామంలో ఓ మతపరమైన ఉత్సవం జరుగుతోంది. కొందరు వ్యక్తులు ఆ ఉత్సవంలో ఆడిపాడుతున్నారు. నృత్య ప్రదర్శన ఇస్తున్నప్పుడు రబీ అనే వ్యక్తి ఉన్నట్టుండి స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో.. అతనిని నయగర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే రబీ చనిపోయినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లిన తర్వాత అంత్యక్రియలు చేయకుండా ఆ వ్యక్తిని బతికించేందుకు గ్రామస్తులు కొన్ని క్షుద్ర పూజలు చేయడం గమనార్హం.

వాళ్ల ఆచారాల ప్రకారం రాత్రంతా మృతదేహాన్ని ముందు పెట్టుకుని కొన్ని పూజలు చేశారు. ఆ తాంత్రిక పూజల్లో భాగంగా.. బిందెల కొద్దీ నీళ్లు మృతదేహంపై పోశారు. ఏవేవో మంత్రాలు చదివారు. ఇలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మను దేవుడు తిరిగి మృతదేహంలోకి పంపిస్తాడన్నది ఆ ఊరి జనం నమ్మకమట. ఉదయానికి.. ఆ ఊరి జనం చేస్తున్న ఈ పూజల గురించి తెలుసుకున్న పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఊరి జనానికి అర్ధమయ్యే విధంగా చెప్పి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించడంతో రబీ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed