వికారాబాద్ జిల్లాలో 1,795 గృహాలు లాక్!

by Sridhar Babu |

దిశ, రంగారెడ్డి: కరోనా వేగంగా విస్తరిస్తున్ననేపథ్యంలో వికారాబాద్ పట్టణంలోని రామయ్య గూడ, గరీబ్ నగర్లు రెండింటిని అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. మంగళవారం ఈ వార్డుల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు మంగళవారం పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వికారాబాద్ గెస్ట్‌ హౌస్‌లో ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో దీనికి సమాచారం అందిస్తే వెంటనే వైద్య బృందం రంగంలోకి దిగుతుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్య బృందంతో పాటు ఇతర అధికారులు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

జిల్లాలో కరోనా తాజా పరిస్థితిపై వైద్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. జిల్లాలో కరోనా వ్యాధి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వారు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1,795 గృహాలను అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని చెప్పారు. దేశ, విదేశాల నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన వారిని గుర్తించి, వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారన్నారు. జిల్లాలో దాదాపు 135 మంది దేశ, విదేశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. వారందరిని 14 రోజులపాటు గృహ నిర్బంధం చేశామన్నారు. వైద్య నిర్బంధంలో ఉన్న 373 మందిని వైద్య పరిశీలన అనంతరం పంపించి వేశామన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చి వారిని కలిసిన కారణంగా 1,287 మందిని సాధారణ గృహ నిర్బంధం చేశారు. దాదాపు 7,828 మందికి అధికారులు స్టాంపింగ్ వేయించారు. 1,151 గృహాలకు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రత్తలకు చెందిన స్టిక్కర్లను అంటించి అవగాహన కల్పించామన్నారు. జిల్లాలో 79 మందికి కరోనా రక్త నమూనాలు సేకరించినట్టు వెల్లడించారు.అందులో 14 మందికి నెగిటివ్, 5గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి తరలించామన్నారు. మరో 61 మందికి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. అవి వస్తే జిల్లాలో కరోనా నెగిటివ్, పాజిటివ్ కేసుల నిర్దారణ అవుతుందన్నారు. నేటికి జిల్లాలో 4ప్రాంతాలను రెడ్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో బ్యాంకులు, వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. 144 సెక్షన్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో 54 రాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. కొన్ని టీములు ఈ నాలుగు ప్రాంతాల్లోకి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. జిల్లాలో హరిత రిసార్ట్స్ టీవీ శానిటోరియం, శ్రీ సాయి డెంటల్ కళాశాల, మహావీర్ ఆసుపత్రి, మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తాండూర్ హెల్త్ వెల్ఫేర్, వికారాబాద్లో 6 కరోనా వ్యాధి పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో పాటు జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంచేశారు. రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ఏరియాల్లో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు జిల్లా స్థాయి వైద్యాధికారులు, ఆర్డివోలు, తహశీల్దార్‌లు పర్యటించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వారితో పాటు డీఎస్పీ, ఎస్పీలు, సీఐ బందోబస్తు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాట్టు తెలిపారు.

Tags: 1795 houses locked, vikarabad dist, corona, state lockdown, collector pausumi prasad

Advertisement

Next Story

Most Viewed