వైఎస్సార్సీపీకి అగ్నిపరీక్షే..నెగ్గుతుందా?

by srinivas |   ( Updated:2020-03-14 04:12:29.0  )
వైఎస్సార్సీపీకి అగ్నిపరీక్షే..నెగ్గుతుందా?
X

ఆంధప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో పోటీ పడనున్న ప్రధాన పార్టీలు జయాపజయాలపై ఒక అంచనాకు వచ్చి నామినేషన్లు దాఖలు చేశాయి. విజయవాడ మున్సిపాలిటీపై మా జెండా ఎగురుతుందని టీడీపీ అంటే..కాదు మా జెండా ఎగురుతుందని వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. విజయవాడ మేయర్ పీఠం రెండు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠగా మారిన నేపథ్యంలో అక్కడ గెలుపెవరిది? ఓటర్ల మనోగతమేంటి? ఎవరికి విజయావకాశాలున్నాయి? అన్న వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడది ప్రత్యేక ప్రస్థానం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చైతన్యం ఎక్కువ కలిగిన ప్రాంతమేదైనా ఉందంటే అది విజయవాడ అనడంలో అతిశయోక్తి లేదు. విజయవాడలో కుల సమీకరణాలతో పాటు, ఆర్థిక సమీకరణలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. విజయవాడ సుదీర్ఘకాలంగా టీడీపీని ఆదరిస్తూ వస్తోనన్న నగరం. పాలకుల్లో మెజారీ రెండు సామాజిక వర్గాలకు చెందినవారు ఉండడంతో ఎన్నికల్లో వారికే సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు.

విజయవాడ అర్బన్‌లోని మెజారిటీ ప్రజలు టీడీపీకి మొగ్గు చూపినా.. వివిధ ప్రాంతాల్లో దిగువ మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలు మాత్రం వామపక్షాలను బాగాఆదరించారు. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో వారు ప్రభావం చూపుతూ వస్తున్నారు. దీంతో కౌన్సిలర్లను ఎన్నుకోవడంలో వారు కీలకంగా మారుతున్నారు. ఈ కౌన్సిలర్లు ఎవరిని మేయర్‌గా ఎన్నుకుంటున్నారన్నదానిని పెద్దగా పట్టించుకోరు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు సామాజిక వర్గాలను రాజకీయపార్టీలు ముందుకు తెస్తాయి. ఈ సారి మేయర్ ఎన్నికల్లో ఫించన్లు, రేషన్, వలంటీర్లు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే వీరు ఎవరికి మద్దతు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. కరకట్టలపై నివాసం ఉంటున్నవారిని ప్రభుత్వం కట్టిన ఇళ్లకు మార్చి, కరకట్టలను బలోపేతం చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది దిగువ మధ్యతరగతి ప్రజలతో పాటు, కరకట్టలపై నివాసాలేర్పర్చుకున్నవారిలో ఆశలు రేపుతోంది. సుదీర్ఘ కాలం ఇళ్ల స్థలం కొనగలిగే స్ధోమత లేక కుమిలిపోయిన వారికి ప్రభుత్వం ఆశచూపుతుందని భావిస్తున్నారు. వారంతా వైఎస్సార్సీపీకి అండగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

అమరావతి విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. అలా ఉన్నవారిలో మెజారిటీలు టీడీపీ మద్దతుదారులు. రాజధానిని తరలిస్తే ఆ ప్రభావం విజయవాడపై పడుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. నేపథ్యంలో ఒక సామాజిక వర్గం మొత్తం వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో టీడీపీ లాభపడే అవకాశం ఉందని ఆ పార్టీ ఆశపడుతోంది. మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తెను మేయర్ పదవికి బరిలోకి దించారు. తన కుమార్తెను గెలిపించుకోవాలని నాని ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించారు. వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ మేయర్‌గా కేశినేని కుమార్తె ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

పట్టణాల్లో ఎగువ, ఎగువ మధ్య తరగతి ప్రజలు తమ ప్రాధామ్యాల ప్రకారం ఓట్లేస్తారు. వీరిని మార్చగల సాధనాలు పెద్దగా లేవనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఓటింగ్ పట్ల వీరికి పెద్ద ఆసక్తి కూడా ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇతరులు కచ్చితంగా ఓటేస్తారని, వీరే ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది మేయర్ పీఠంపై ఎవరి జెండా ఎగురుతుందన్నదాన్ని నిర్ణయిస్తుందని వారు చెబుతున్నారు. అయితే, ఆయా పార్టీల మద్దతుదారులు ఓటర్లు మావైపు ఉన్నారంటే మావైపే ఉన్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

Tags: vijayawada, vmc, mayor seat, tdp, ysrcp, local body elections

Advertisement

Next Story

Most Viewed