కాంగ్రెస్‌పై రాములమ్మ అనూహ్య వ్యాఖ్యల ఆంతర్యమేంటి?

by Anukaran |
కాంగ్రెస్‌పై రాములమ్మ అనూహ్య వ్యాఖ్యల ఆంతర్యమేంటి?
X

దిశ, మహబూబ్ నగర్: గతకొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బీజేపీలో చేరనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె చేసిన ట్వీట్ సంచలనానికి దారి తీసింది. రూమర్లకు బలాన్ని చేకూరుస్తున్నట్టు ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీని బలహీన పర్చడం వల్లే బీజేపీ.. టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరే స్థాయికి చేరింది.. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌ కొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగయ్యేది.. ఇక కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తును కాలం, ప్రజలే నిర్ణయిస్తారు..’’ అని విజయశాంతి ట్విట్టర్లో పేర్కొన్నారు.

అంతేకాకుండా ‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు సరిగ్గా వర్తించే సమయం సమీపించింది.. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి, భయపెట్టి, ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది.’ అని విజయశాంతి ట్విట్టర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన ఈ వ్యాఖలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ వర్గాలు తమకు అనుకూలంగా వర్ణిస్తుంటే, బీజేపీ శ్రేణులు వారికి అనుకూలంగా ప్రచారం సాగిస్తున్నారు. మా పార్టీ నేతల్ని కేసీఆర్ లాక్కోవడం వలన టీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిందని, ఇది అదునుగా చూసుకుని బీజేపీ వారిని బలహీన పరిచేందుకు చూస్తోంది. ఇక టీఆర్‌ఎస్ బలహీనపడితే… ప్రజల మద్దతు కాంగ్రెస్ కే ఉంటుందని విజయశాంతి ఉద్దేశం అని కాంగ్రెస్ నేతలు సమర్ధించుకుంటున్నారు.

మరోవైపు బీజేపీ నేతలు మాత్రం… కాంగ్రెస్ కు తెలంగాణాలో భవిష్యత్తు లేదని విజయశాంతి ట్వీట్ ద్వారా తేటతెల్లం అవుతోందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై సొంత నేతల్లోనే అనుమానాలున్నాయని, ఇంక ప్రజలకి నమ్మకం ఏముంటుందని విమర్శిస్తున్నారు. భవిష్యత్తు లేని పార్టీలో ఉండటం కంటే తెలంగాణాలో ఊపందుకుంటోన్న బీజేపీలో చేరేందుకు విజయశాంతి సన్నాహాలు చేస్తున్నారని కమలం పార్టీ కార్యకర్తలు ప్రచారం మొదలెట్టేశారు. ఆమె ఏ పార్టీలో ఉంటారు అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ స్టోరీని తలపిస్తోంది.

Advertisement

Next Story