విజయదశమి విశిష్టత..

by Shyam |   ( Updated:2020-10-24 21:04:12.0  )
విజయదశమి విశిష్టత..
X

దిశ, వెబ్‌డెస్క్: విజయదశమి రోజున సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి ఆది దేవుడు విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజున ప్రారంభింస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మిచెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో, ధన స్థానంలో, గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివలన ధన వృద్ధి జరుగుతుందని నమ్మకం.

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుంచి తొమ్మిది రాత్రులు, తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే ‘శరన్నవరాత్రులు’ లేదా ‘దేవి నవరాత్రులు అంటారు.

నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత అమ్మవారిని ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల్లో రాహుకాల సమయంలో దీపం వెలిగించాలి. దీనివలన రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.

విజయదశమి “దసరా” నిర్ణయం:- 25 అక్టోబర్ 2020 ఆదివారం రోజు దసరా పండగ నిర్వహించుకోవాలని పంచాంగ కర్తలు నిర్ణయించారు. శాస్త్ర ప్రకారం ఆశ్వయుజ మాసంలో దశమి తిధి రోజు శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న రోజు విజయ దశమి పండగ నిర్వహించుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. తేది 24 శనివారం రోజు ఉదయం 11:17 నిమిషాల వరకు అష్టమి తిధి ఉన్నది. నక్షత్ర పరంగా చూస్తే సూర్యోదయం తర్వాత ఉదయం 6:33 నిమిషాలకు శ్రవణ నక్షత్రం ప్రారంభం అవుతుంది.

తేది 25 ఆదివారం రోజు సూర్యోదయంతో శ్రవణ నక్షత్రం ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉదయం 6:51 నిమిషాల వరకు ఉంటుంది. ఇక మనకు ఆదివారం రోజు సూర్యోదయంతో నక్షత్రం ఉన్నది. తిధి ఆదివారం రోజు ఉదయం 11:02 నిమిషాల వరకు నవమి తిధి ఉన్నది, ఆ తర్వాత 11:03 నిమిషాల నుండి దశమి తిధి ప్రారంభం అవుతుంది. శాస్త్ర సూచన ప్రకారం తేది 25 ఆదివారం రోజు దసరా పండగ నిర్వహించుకోవాలి.

శ్లో II ఆశ్వినే శుక్ల పక్షేతు దశామ్యామపరాజితా
పూజనీయా ప్రయత్నేన క్షేమర్ధంచ నృపైస్సదా.

శ్లో II నవమీ శేష యుక్తాయా దశమ్యా మపరాజితా
పూజనీయా ప్రయత్నేన క్షేమార్ధంచ నృపైస్సదా.

శ్లో II నవమీ శేష యుక్తాయా దశమ్యా మపరాజితా
దధాతి విజయందేవి పూజితా జయవర్ధనీ.

అను శాస్త్ర ప్రమాణములను అనుసరించి తేది 26 సోమవారం రోజు ముఖ్య గౌణకాలములందు దశమి తిధి వ్యాప్తి లేనందున, ఆదివారం రోజు ముఖ్య గౌణకాలములందు దశమీ తిధి వ్యాప్తి చెంది ఉన్నందున తేది 25 అక్టోబర్ 2020 ఆదివారం రోజుననే విజయదశమి పండగ ఆచరించవలెను.

అక్టోబర్ 25 ఆదివారం రోజు విజయదశమి పూజ ప్రారంభం సమయం ఉదయం 8:40 నుండి 11:57 నిమిషాలు.

శమీ, ఆయుధ పూజలు ఉదయం 10:25 నుండి 12:14 వరకు.

అపరాజితా దేవీ పూజ సమయం మధ్యాహ్నం 1:00 నుండి 3:18 వరకు.

విజయదశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 నుండి 2:32 .

విజయదశమి పర్వదిన దుర్గాదేవీ ఉద్వాసన సాయంత్రం 5:36 నుండి రాత్రి 8:00 వరకు

లేదా మరుసటిరోజు 26 సోమవారం రోజు ఉదయం 6:06 నుండి 8:24 వరకు.

* ( అక్టోబర్ 25 వ తేదీ ఆదివారం రోజు ఇతర శుభకార్యా ముహూర్తాలు ) :-

1) ఉదయం 10:43 నిమిషాలకు ధనుర్లగ్నంలో వివాహం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, అద్దె గృహాలలో ప్రవేశాలకు, ఇతర శుభాదులకు అనుకూలం. ధనుర్లగ్న ముహూర్త సమయం ఉదయం 9:53 నుండి 12:02 వరకు, శుభాంశ ఉదయం 10:43 నిమిషాలకు.

2) సకల శుభకార్యాలకు మధ్యాహ్నం 1:46 నుండి 2:32 వరకు.

3) సాయంత్రం మేషలగ్నం 5:07 నుండి 6:53 వరకు డోలహరణం ( బిడ్డను ఉయాలలో వేయుటకు), శుభ చర్చలకు, విద్య, వ్యాపార, వాహన ప్రారంభాలకు, శుభాంశ సాయంత్రం 6:47 నిమిషాలకు.

4) మిధునలగ్నం రాత్రి 8:54 నుండి 11:06 వరకు వివాహము, గృహాప్రవేశానికి, గర్భాదానానికి, వ్యాపారప్రారంభ హోమాదులకు, శుభాంశ రాత్రి 9:01 నిమిషాలకు.

పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మిచెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు.

శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అలా ఆయా రూపాలతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.

Advertisement

Next Story