ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి థ్యాంక్స్ చెప్పిన అర్జున్ రెడ్డి

by Anukaran |   ( Updated:2021-10-06 07:20:11.0  )
Vijay Devarakonda, MLC Kavitha
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబురంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబురం బతుకమ్మ పండుగ. అయితే.. ఇంత ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ పండుగ నేడు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఖ్యాతిని, పండుగ విశిష్టతను దేశ నలుమూలలా తెలియజెప్పే విధంగా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డైరెక్టర్ గౌతమ్ మీనన్‏తో కలిసి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ‘అల్లిపూల వెన్నెల’ పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగులో రూపొందించారు. తాజాగా.. విడుదలైన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక మరోసారి.. తన మ్యూజిక్ మాయతో ఏఆర్ రెహామాన్.. గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మాయ చేశారు.

అయితే.. ఈ పాటపై ‘లైగర్’ విజయ్ దేవరకొండ స్పందించారు. ముందుగా, మొదటి ట్వీట్‌లో అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాకుండా.. తన ఫ్యామిలీ ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటుందని వెల్లడించారు. అనంతరం ‘‘కల్వకుంట్ల కవిత అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ప్యాషన్ తో ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సహిస్తున్నారు. ఈ అందమైన స్థానిక పండుగ గురించి మాకు మరియు దేశానికి అవగాహన కల్పించారు.’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story