రాజకీయాల్లో మాయాజాలం పెరిగింది

by Shamantha N |
రాజకీయాల్లో మాయాజాలం పెరిగింది
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుతం రాజకీయాల్లో భావాజాలం తగ్గుతూ మాయాజాలం పెరుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయ పడ్డారు. రాజకీయం అనేది ఒక సిద్ధాంతమని, అది మెరుగైన సమాజం కోసం పనిచేయాలని సూచించారు. ఆలోచనలు పంచుకొని, పెంచుకొని ముందుకు వెళ్లాలన్నారు. దివంగత నేత జైపాల్‌రెడ్డి రచించిన ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాద పుస్తకం ‘పది భావజాలాలు’ను వెంకయ్యనాయుడు మంగళవారం సాయంత్రం ఆన్‌లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం ముందు తరాలకు దిశానిర్దేశం, మార్గదర్శనం చేయడానికి ఉపయోగపడాలని కోరారు. జైపాల్‌రెడ్డికి తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తర్కంగా ఆలోచించి చెప్పడం జైపాల్‌రెడ్డి ప్రత్యేకత అని, ఆయన తన వాదనాపఠిమతో లోతైనా అధ్యయనం, విశ్లేషణ చేసేవారని, వీటి సమాహారమే ఈ పుస్తకమని ఉపరాష్ట్రపతి వివరించారు.

చక్కని అనువాదంతో ఈ పుస్తకం ఎందరినో మెప్పిస్తుందని, తామిద్దరం శాసనసభలో ఒకే బెంచ్‌పై కూర్చునే వాళ్లమని నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం సౌఖ్యం పెరిగిందని, దూరం తగ్గిందని, ఎందరో వ్యవసాయాన్ని వదిలి వెళ్ళి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాన్ని పది భావజాలాలు పూసగుచ్చినట్లు వివరిస్తుందని, రైతుల యోగ క్షేమాల గురించి జైపాల్ ఆలోచించేవారని, ఎంతో విలక్షణతో దేశసేవ చేశారని కొనియాడారు. ఆయనను రాజకీయ నాయకుడు అనడం కంటే ధాత్త్విక దృక్పధం గల వ్యక్తిగా అభివర్ణించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, జైపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, ఆయన కుమారుడు అరవింద్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed