విద్యాశాఖ‌కు నిరక్షరాస్యత బడ్జెట్‌

by Shyam |   ( Updated:2020-03-21 00:35:08.0  )
విద్యాశాఖ‌కు నిరక్షరాస్యత బడ్జెట్‌
X

దిశ, న్యూస్‌బ్యూరో: నోరెత్తితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విద్యారంగంలో తీవ్ర అన్యాయానికి గురైందని తరచూ విమర్శించే సర్కార్ పెద్దలు ప్రజెంట్ సొంత రాష్ట్రంలో కూడా నిధులను తగ్గించుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో బడ్జెట్‌లో విద్యా రంగానికి 14శాతం నిధులు కేటాయించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ స్థాయిలో కేటాయింపులు జరిపిన దాఖలాలు లేవు. పైగా ఏటికేడు బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ వస్తుండటం గమనార్హం. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని సీఎం, మంత్రులు చెబుతూ దేశ సగటు కంటే మన తలసరి ఆదాయం ఎక్కువని పోటీపడి ప్రకటనలు చేస్తారు. కానీ విద్యారంగంలో మనం ఎక్కడ ఉన్నామో చెప్పరు. ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే టీచర్ పోస్టుల భర్తీ చేసిన గవర్నమెంట్.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ, పారిశ్రామిక డెవలప్‌మెంట్ జరుగుతోందని చెబుతోంది. అయితే అందుకు అవసరమైన నిపుణులను మాత్రం తయారు చేసే దిశగా ఆలోచన లేనట్టు కనిపిస్తోంది.

2014లో తొలిసారిగా రూ.లక్షకోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కార్ అందులో 10.89శాతం అంటే రూ.10,963 కోట్లను కేటాయించింది. ఇప్పుడు 2020-21లో దాదాపు లక్షా 84 కోట్ల బడ్జెట్ ను పెట్టగా కేవలం 6.69 శాతంతో రూ.12,144 కోట్లు మాత్రమే కేటాయించింది. వరుసగా ఇప్పటివరకు ఏడేండ్లు కేటాయింపులను తగ్గించుకుంటూ వస్తోంది. ఉద్యమ సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలే లేకుండా చేస్తామని, కార్పొరేట్ స్థాయిలో సర్కార్ విద్యను అందిస్తామన్న కేసీఆర్.. ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే కాకుండా విద్యాశాఖకు బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో విద్యావకాశాలు మెరుగుపడకుండా ఉద్యోగాల భర్తీ, నైపుణ్యత ప్రశ్నార్థకమవుతుంది.

విద్యారంగంపై పూర్తిస్థాయిలో చర్చించాలి
– శ్రీహరి, ఏబీవీపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలతో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అవుతూ వస్తోంది. విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు యూనివర్సీలు తీసుకురావడంతో పాటు ఇప్పుడున్న యూనివర్సిటీలకు కేటాయింపులు లేవు. విద్యారంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ నిధులపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చలు జరపాలి.

కార్పొరేట్ సంస్థలపైనే ప్రభుత్వ ప్రేమ
– రవి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కార్పొరేట్ సంస్థలే బతకాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు బడ్జెట్ కేటాయింపులు చూస్తే అనిపిస్తుంది. ప్రైవేటు సంస్థలే లేకుండా చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారు. విద్య లేకుంటే అన్ని రంగాల్లో వెనకబాటు తప్పదు. ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ఇంటర్, డిగ్రీ స్థాయిలో గురుకులాలు వచ్చాయి. రాష్టంలో అనేక గురుకులాలు, హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.

Tags: Telangana budget, , Education, funds, SFI, ABVP, Literacy, TRS

Advertisement

Next Story

Most Viewed