వైరా ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. ‘రిగ్గింగ్’ చేసి గెలిపిస్తే మమ్మల్నే వదిలేస్తావా.?

by Sridhar Babu |
rigging
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌కు నిరసన సెగ తగిలింది. ఒకప్పుడు ఆయన అనుచరులుగా ఉన్నవారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆయన్ను గ్రామం నుంచి తరిమేశారు. తమ తండాకు ఎందుకు వచ్చావు..? నీకేం అర్హత ఉంది..? నీకు ఓటేసి తప్పు చేశాం.. రిగ్గింగ్ చేసి గెలిపిస్తే మమ్మల్నే పట్టించుకోవా..? అంటూ నిలదీశారు. దీంతో రాములు నాయక్ చేసేది ఏం లేక అక్కడ నుంచి పోలీసులు, ఆయన అనుచరుల సహాయంతో వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకటియా తండాలో ఆదివారం తీజ్ ఉత్సవాలు చివరి రోజు కావడంతో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తన అనుచరగణంతో అక్కడకు వెళ్లారు. రాములు నాయక్‌ను చూడగానే ఆ తండావాసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏ మొహం పెట్టుకుని వచ్చావు..? ఇప్పుడు గుర్తొచ్చామా..? మా తండాకు ఏ పనీ చేయని నీకు అసలు ఇక్కడ వచ్చేందుకు అర్హతే లేదంటూ ఆయన్ను తీవ్రంగా ప్రతిఘటించారు. అంతేకాదు.. తండా అభివృద్ధిని పట్టించుకోకుండా కనీసం రోడ్లు, డ్రైనేజీలు సైతం బాగు చేయించలేని నువ్వు ఇక్కడ ఉండొద్దంటూ ఆందోళనకు దిగారు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా తండా మొహమే చూడలేదని, ఏదైనా సమస్య వస్తే కనీసం ఫోన్ కూడా మాట్లాడే పరిస్థితి లేదా..? అంటూ కడిగిపారేశారు.

రిగ్గింగ్ చేసి గెలిపిస్తే..

అంతేకాదు.. ఒకప్పుడు ఆయన అనుచరులుగా ఉన్నవారు, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. రిగ్గింగ్ చేసి గెలిపించినందుకు తమను పట్టించుకోవా..? ఇదేనా మాకిచ్చే విలువ.. ఇన్నాళ్లకు గుర్తొచ్చామా…? అంటూ తీవ్ర ఆందోళన చేయడంతో రాములు నాయక్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక వారు చెప్పిన దానికల్లా తలూపుతూ పోలీసులు, తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అయినా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఎలాగోలా అక్కడినుంచి బయటపడ్డారు..

నిజంగానే దొంగ ఓట్లే వేయించారా.?

వెంకటియా తండావాసులు, రాములు నాయక్ అనుచరులే రిగ్గింగ్ చేసి గెలిపించామంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. రాములు నాయక్ సహజంగా అలాంటి వారేనని, అలా చేయించినా ఆశ్యర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ‘‘ విద్యార్థులకు డబ్బులు పంచండి.. నేను చూసుకుంటాను.. ఎవరితో ఏం భయం లేదు.. ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నా..’’ అంటూ రాములు నాయక్ మాట్లాడిన వీడియో ఒకటి హల్ చల్ చేసింది. ఈ మధ్య తన అనుచరులపై సహనం కోల్పోయి దాడికి దిగిన ఘటన కూడా మీడియాలో వచ్చింది. ఇప్పుడు ‘‘రిగ్గింగ్ చేసి గెలిపిస్తే..’’అంటూ రాములు నాయక్ అనుచరులు వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, రాములు నాయక్ గెలుపుపై విచారణ చేపించాలని కొందరు విపక్షానికి చెందిన నాయకులు చెబుతున్నారు.

Advertisement

Next Story