జేజే ఆసుపత్రిలో చేరిన వరవరరావు

by Anukaran |   ( Updated:2020-07-13 11:13:54.0  )
జేజే ఆసుపత్రిలో చేరిన వరవరరావు
X

దిశ, న్యూస్‌బ్యూరో: మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న పౌరహక్కుల కార్యకర్త వరవరరావును సోమవారం రాత్రి ముంబయిలోని జేజే ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయనకు తక్షణం వైద్య చికిత్స అందజేయాలని కుటుంబ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేయడంతో పాటు పార్లమెంటు సభ్యులు, మేధావులు కేంద్ర హోం మంత్రిత్వశాఖను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. వరవరరావు తరఫున న్యాయవాదులు సైతం సోమవారం ముంబయి హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.

మే నెల చివరి వారంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళి జేజే ఆసుపత్రిలో చేరింది మొదలు ఆయన ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని, కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడలేని స్థితికి చేరుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం నిర్బంధ వ్యతిరేక వేదిక తరఫున ప్రొఫెసర్ హరగోపాల్ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సానుకూల స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వరవరరావు తరఫున ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైన గంటల వ్యవధిలో ఆయనను జేజే ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు రావడం గమనార్హం. అయితే వైద్యులు పరీక్షించిన తర్వాత ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారానికి తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed