ఇక ఎదురుచూపులే.. వ్యాక్సిన్ నో స్టాక్..!

by Shyam |   ( Updated:2021-04-28 12:11:09.0  )
ఇక ఎదురుచూపులే.. వ్యాక్సిన్ నో స్టాక్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతానికి టీకాల నిల్వలు పూర్తిగా అయిపోయాయి. కొత్తగా స్టాకు వస్తేనే గురువారం టీకాల పంపిణీ మొదలుకానుంది. ఇప్పటికే చాలా కేంద్రాల్లో టీకాలకు కొరత ఏర్పడింది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో స్టాకు లేని కారణంగా వ్యాక్సిన్ పంపిణీ ఆగిపోయింది. ఇదే సమయంలో మే 1వ తేదీ నుంచి 18-44 ఏజ్ గ్రూపు వారికి టీకాల పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. అప్పటికల్లా వ్యాక్సిన్ డోసులు ఏ మేరకు వస్తాయనేది రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు స్పష్టత లేదు. కానీ రెడ్డీస్ లాబ్ సంస్థ స్పుత్నిక్-వి టీకాలను ఆ రోజుకల్లా దిగుమతి చేసుకుంటుందనే సమాచారం అందింది. వాటితో పాటు భారత్ బయోటెక్ కూడా కొవాగ్జిన్ డోసులను కొంత మేరకు సమకూర్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. వీటి ఆధారంగా మే నెల 1వ తేదీ నుంచి లాంఛనంగా టీకాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేసినవాటిలో వినియోగించకుండా ఉన్న డోసులను తిప్పి పంపించాల్సిందిగా అన్ని జిల్లాల వైద్యాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.

సీఎం సమీక్ష తర్వాత క్లారిటీ..

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు మూడు రోజుల్లో ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ అధికారులతో రాష్ట్రంలోని కరోనా తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్, టెస్టింగ్ కిట్లు, నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, లాక్‌డౌన్ ఆవశ్యకత, ఆస్పత్రుల్లో బెడ్‌ల పెంపు, ఆక్సిజన్ కొరత తదితర అన్ని అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే భారత్ బయోటెక్, రెడ్డీస్ లాబ్, సీరం ఇన్‌స్టిట్యూట్ తదితర సంస్థలతో వ్యాక్సిన్ కొనుగోళ్ళపై ప్రాథమిక స్థాయి చర్చలు జరిగాయి. ఏ మేరకు డోసులు అందుతాయో క్లారిటీ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంత వేగంగా అమలుచేయనున్నదీ స్పష్టమవుతుంది.

మరే రాష్ట్రం కంటే ఉన్నతంగా వ్యాక్సినేషన్‌ కొనసాగించి ఆదర్శంగా నిలవాలని సీఎం భావిస్తున్నారు. వీలైనంత తొందరగా ఎక్కువ శాతం మందికి టీకాలు ఇవ్వడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అడ్డుకట్ట వేయవచ్చని, నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుందనుకున్న థర్డ్ వేవ్‌కు బ్రేక్ వేయవచ్చని అనుకుంటోంది. ఇందుకోసం స్పష్టమైన విధి విధానాలను కూడా రూపొందించనుంది.

స్పాట్ రిజిస్ట్రేషన్లతో షురూ

కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నవారికి టీకాల్లో అలాంటి ఇబ్బంది రాకుండా స్పాట్ రిజిస్ట్రేషన్లను కూడా వైద్యారోగ్య శాఖ మొదలుపెట్టనుంది. మే 1వ తేదీ నాటికి చేతిలో ఎంత స్టాక్ ఉంటుందో దానికి అనుగుణంగా వ్యాక్సిన్ కేంద్రాలను తెరవడంపై నిర్ణయం జరగనుంది. వారం రోజుల్లోనే సంతృప్తికరమైన మోతాదులో టీకాలు అందుతాయన్న భావనతో దశలవారీగా కేంద్రాల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కొవిన్ పోర్టల్‌లో లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకోడానికి సంబంధం లేకుండానే అక్కడికక్కడే వివరాలను నమోదు చేసుకుని టీకాలు ఇవ్వాలనుకుంటోంది. వ్యాక్సిన్ డోసుల లభ్యతను బట్టి పంపిణీ కార్యక్రమాన్ని ఉధృతం చేయనుంది.

ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు బంద్

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇప్పటివరకు 45 ఏళ్ళ వయసు పైబడినవారికి టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ కోటా నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు టీకాల పంపిణీ కూడా జరుగుతోంది. అయితే మే 1వ తేదీ నుంచి నేరుగా తయారీ సంస్థల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నుంచి సరఫరా నిలిచిపోనుంది. ఇప్పటివరకు వినియోగించకుండా మిగిలిపోయిన డోసుల్ని తిరిగి ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల వైద్యాధికారుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రూ. 150 చొప్పున ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చినందున మిగిలిపోయినవాటిని వచ్చే నెల నుంచి ఎక్కువ ధరకు (రూ. 600) లబ్ధిదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉన్నందున వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సరఫరా చేసినవి, తిరిగి ఇచ్చిన లెక్కలను ఆడిట్ చేసి జీరో బ్యాలెన్స్ చేయాలనుకుంటోంది.

సెకండ్ డోస్ ఎక్కడైనా తీసుకోవచ్చు..

ఇప్పటికే ఫస్ట్ డోస్ తీసుకున్నవారికి మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రైవేటు ఆస్పత్రులు కొంత స్టాక్‌ను పెట్టుకునే అవకాశం ఉంది. అయితే సెకండ్ డోస్ విధిగా అక్కడే తీసుకోవాలనే ఉద్దేశం లేనందున మొత్తం స్టాక్‌ను (వినియోగించకుండా మిగిలిపోయినవి) తిరిగి వైద్యరోగ్య శాఖ వాపస్ తీసుకోనుంది. సెకండ్ డోస్ కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ టీకా కేంద్రాల దగ్గరకు వచ్చి తీసుకోవచ్చనే స్పష్టతను కూడా త్వరలో ఇవ్వనుంది. ఏ ఏజ్ గ్రూపువారైనా రాష్ట్రంలోని ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలను ఉచితంగానే తీసుకునే సౌకర్యం కలిగింది.

నేడు రాష్ట్రానికి మూడున్నర లక్షల డోసులు..

కేంద్ర కోటా కింద గురువారం సాయంత్రంకల్లా మూడున్నర లక్షల టీకా డోసులు రాష్ట్రానికి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం దగ్గర యాభై వేల కంటే ఎక్కువ డోసులు లేనందున పరిమితంగానే వాడుతోంది. అనుకున్నట్లుగా కొత్త స్టాక్ వస్తే మూడు రోజుల వరకు ఢోకా ఉండదని ఓ అధికారి పేర్కొన్నారు. ఆ డోసులు అయిపోయే లోపు ’స్పుత్నిక్-వి’తో పాటు కొవాగ్జిన్ నిల్వలు కూడా సమకూరే అవకాశం ఉంది.

టెస్టుల కోసం తొందరొద్దు : డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ

ఇంతకాలం కరోనా లక్షణాలకు తోడు ఇటీవల వాంతులు, విరేచనాలు లాంటివి కూడా తోడయ్యాయని, రెండు రోజుల పాటు తగ్గకుండా ఉంటే అనుమానించాల్సి ఉంటుందని, అప్పుడు టెస్టులు చేయించుకోవాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. జలుము, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పి లాంటివి వచ్చిన వెంటనే కరోనా అని అనుమానించాల్సిన అవసరం లేదని, రెండు రోజుల తర్వాత కూడా తగ్గకపోతేనే టెస్టింగ్ కోసం వెళ్ళాలని సూచించారు. చిన్న లక్షణం కనిపించినా టెస్టుల కోసం క్యూ కడుతున్నారని, ఈ కారణంగా నిజమైన పేషెంట్లకు అవకాశం లభించడంలేదన్నారు. కొన్ని సందర్భాల్లో వైరస్ వ్యాప్తి ఇక్కడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొత్త కేసుల సంఖ్య స్థిరంగా ఉందని, అయినా రానున్న మూడు, నాలుగు వారాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఆస్పత్రుల్లో అడ్మిషన్ల విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతోందని, తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరమైనవారు మాత్రమే చేరాలని సూచించారు. ఇప్పటిదాకా దాదాపు 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని గుర్తుచేశారు. ఆస్పత్రుల్లో చేరినవారికి కూడా రెమిడెసివిర్ దివ్య ఔషధం అనే అభిప్రాయం ఉందని, మోడరేట్ సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఆ ఇంజెక్షన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి పాజిటివ్ వచ్చినా ప్రాణాపాయ పరిస్థితి దాకా వెళ్ళడంలేదని, కనీసం ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడంలేదని గుర్తుచేశారు. ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story