వైద్యారోగ్య శాఖకు సవాల్‌గా మారిన వ్యాక్సినేషన్

by Shyam |   ( Updated:2021-09-25 10:56:10.0  )
Corona Vaccination
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సినేషన్​ వైద్యారోగ్యశాఖకు పెద్ద సవాల్​ గా మారబోతున్నది. 3 నెలల్లో ప్రజలందరికీ టీకా అందించాలని హైకోర్టు విధించిన డెడ్​లైన్​ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విధానంలోనే పంపిణీ ప్రక్రియ కొనసాగితే ,ఇప్పటి వరకు టీకా పొందని వారికి కనీసం సింగిల్​ డోసును పూర్తి చేసేందుకు సుమారు 5 నుంచి 6 నెలల వ్యవధి పట్టొచ్చని అధికారులు అప్​ ది రికార్డులో చెబుతున్నారు. పదిహేను రోజుల క్రిందట సీఎం కేసీఆర్​ సూచించినట్టు ప్రస్తుతం ప్రతీ రోజు 3 నుంచి 4 లక్షల మందికి డోసులు ఇస్తున్నా.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కోర్డు గడువు లోపు టీకా ఇవ్వాలంటే ఈ వేగం సరిపోదని అధికారులు అంచనా వేస్తున్నారు.

అర్హులు..2.86 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా 2.86 కోట్ల మంది టీకాకు అర్హులు ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 67,26,469 మందికి మాత్రమే రెండు డోసులు పంపిణీ పూర్తయింది. దీంతో పాటు మరో కోటి 11 లక్షల మందికి సింగిల్ డోసు వేశారు. కానీ కోటి 2 లక్షల మందికి కనీసం ఒక్క డోసు కూడా వేయలేదు. అంటే వీరందరికీ వ్యాక్సినేషన్​ను పూర్తి చేయాలంటే రాబోయే 3 నెలల్లో 3.15 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రతీ నెలా కేవలం 50 నుంచి 60 లక్షల డోసులకు మించి రావడం లేదు.

టీకాల్లో యూపీ స్పీడ్​…

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ యూపీలో స్పీడ్​ గా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు అత్యధికంగా 10.22 కోట్ల డోసులు వేయగా, 2.45 కోట్ల డోసులు పంపిణీతో తెలంగాణ ఏకంగా 13వ స్థానంలో ఉండటం విచిత్రంగా ఉన్నది. అదే విధంగా మహారాష్ట్రలో 7.5 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. రాజస్థాన్‌, కర్ణాటక, బీహార్‌‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బెంగాల్లో సుమారు 5 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగింది. ఇక ఒడిశా, ఏపీ, కేరళ, తమిళనాడులలోనూ 3 కోట్లకుపైగా డోసులు వేశారు. ఇంత వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ప్రతీ రోజు కనీసం 5 నుంచి 6 లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో అతి కష్టం మీద గరిష్ఠంగా 4 నుంచి 5 లక్షల మందికి పంపిణీ చేస్తున్నారు. గతంలో ప్రతీ రోజు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్ధ్యం ఉందని సర్కార్​ చెప్పినప్పటికీ.. ఆ స్థాయిలో పంపిణీ చేసేందుకు టీంలు లేవని స్వయంగా హెల్త్​ ఆఫీసర్లే చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story