ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Sridhar Babu |
ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, జమ్మికుంట: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, బూజునూరు, సీతంపేట, మర్రివానిపల్లి, గడ్డివాని పల్లి, బోగంపాడు, చిన్న కోమటిపల్లి, మల్లన్న పల్లె, రాచపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈటల తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ పార్టీలో చేరారని, ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా ఒంటెద్దు పోకడ అవలంభిస్తున్నారు అంటూ విమర్శి్ంచారు.

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడానికి ఒక గొంతుక కావాలని, అందుకు విద్యావంతుడైన వెంకట్‌ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ తెస్తాం అని గద్దెనెక్కిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇంటికో ఉద్యోగం వస్తుందని, బతుకులు మారుతాయని ఎన్నో ఆశలతో ఉద్యమాలు చేసిన వారు నేడు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారని చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిపల్లి సత్యం, గండ్ర సత్యనారాయణ, ఇంగ్లే రామారావు, సారంగపాణి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story