జర్నలిస్టు హంతకులను విడుదల చేసిన పాక్ పై యూఎస్ సీరియస్

by vinod kumar |
జర్నలిస్టు హంతకులను విడుదల చేసిన పాక్ పై యూఎస్ సీరియస్
X

వాషింగ్టన్: పాకిస్తాన్ లో అమెరికా జర్నలిస్టును కిడ్నాప్ చేసి హత్య చేసినవారిని పాక్ కోర్టు విడుదల చేయడంపై అగ్రరాజ్యం ఆగ్రహించింది. పాక్ కోర్టు తీర్పు బాధితులను అవమానించడమే అని.. ఉగ్రవాదం ప్రతీచోటా ఉందంటూ అమెరికా దౌత్యవేత్త ట్వీట్ చేశారు. అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాదులు జరిపిన దాడుల అనంతరం వాల్ స్ట్రీట్ పత్రిక విలేకరి డేనియల్ పెరల్ (38) పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ ఉగ్రదాడులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయనను ఉగ్రవాదులు టార్గెట్ చేసి డేనియల్ కదలికలపై నిఘా వేశారు. అహ్మద్ ఒమర్ సయీద్ అనే ఉగ్రవాది మరో ముగ్గురితో కలసి 2002లో అతడిని కిడ్నాప్ చేశాడు. డేనియల్‌ను 1 ఫిబ్రవరి 2002లో కరాచీ సమీపంలో తలను నరికి చంపేశాడు. అంతే కాకుండా ఆ పాశవిక హత్యను వీడియో తీసి కొన్నాళ్ల తర్వాత అమెరికా దౌత్యకార్యాలయానికి పంపించాడు. అప్పుడే ఉగ్రవాదుల కౄరమైన చర్య ప్రపంచానికి తెలిసింది. దీనిపై అప్పట్లో అమెరికా తీవ్రంగా స్పందించడంతో పాకిస్తాన్ నిందితులను పట్టుకుంది. సయీద్ కు పాక్ కోర్టు మరణ శిక్ష విధించింది.

కాగా, ఈ కేసును పునర్విచారణ చేసిన సింధ్ కోర్టు గురువారం శిక్షను తగ్గించింది. నిందితులు నేరానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల వారిని విడుదల చేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.

అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో పాక్ విదేశాంగ కార్యాలయం స్పందించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని.. ఆ మేరకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పింది.

Tags: Pak court, american journalist, killed, culprit, released

Advertisement

Next Story

Most Viewed