భారత్‌లో ప్లాంట్ నెలకొల్పే ఆలోచనలో అమెరికా దిగ్గజ సెమీకండక్టర్ల సంస్థ

by Harish |
Appled Materials
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీ అప్లైడ్ మెటీరియల్స్ భారత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీనికోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన పరికరాలను, సేవలను, సాఫ్ట్‌వేర్‌లను ఈ కంపెనీ అందిస్తుంది. సెమీకండక్టర్ల తయారీలో వినియోగించే కీలకమైన పరికరాలతో పాటు విడిభాగాల తయారీ ప్లాంట్‌ను భారత్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా 17.2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగిన ఈ సంస్థ దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా భారత్‌కు కలిసొస్తుందని, ఈ సంస్థకున్న విస్తృతమైన సరఫరా వ్యవస్థ భారత్‌కు ఎంతో ప్రయోజనమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇటీవల కేంద్రం సెమీకండక్టర్లు, ఇతర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ కంపెనీలు కూడా పాల్గొనవచ్చని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed