గుట్టుచప్పుడు కాకుండా చైనా ఏం చేసిందో తెలుసా..?

by vinod kumar |
గుట్టుచప్పుడు కాకుండా చైనా ఏం చేసిందో తెలుసా..?
X

వాషింగ్టన్ : చైనాలోని వూహాన్ నగరంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా ఆ విషయాన్ని చిన్నదిగా చేసి చూపిందా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో కూడా అబద్దమాడిందా..? దీని వెనుక కారణం ఏంటి..? అనే విషయాలపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఒక నివేదిక రూపొందించింది. చైనాలో తనకు గల సోర్స్‌తో పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టింది. చైనాలో వ్యాపించే వైరస్ తీవ్రత బయటి దేశాలకు తెలిస్తే వాళ్లు కూడా అప్రమత్తం అయిపోతారని.. దీంతో ఔషధాలను దిగుమతి చేసుకోవడం కష్టమని చైనా భావించినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. వైరస్ గుర్తించిన వెంటనే చైనాలో భారీ స్థాయిలో ఔషధాలు నిల్వ చేశారని.. ఇతర దేశాల నుంచి మాస్కులు, సర్జికల్ కిట్లు, మందులు భారీగా దిగుమతి చేసుకుంది కానీ వీటిని ఎగుమతి మాత్రం చేయలేదని తెలిపింది. ఒకవైపు తీవ్రతను తక్కువ చేసి చూపడమే కాకుండా.. డబ్ల్యూహెచ్‌వోకు ఇది అంటువ్యాది కాదని తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు కూడా హోంల్యాండ్ సెక్యూరిటీ వివరించింది. ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని చైనా చెబుతున్నా.. అనధికారికంగా మాత్రం మెడికల్ ఎక్విప్‌మెంట్‌ ఎగుమతులపై నిషేధం విధించిందని పేర్కొంది. వైరస్ గుర్తించిన తర్వాత చైనా ఎగుమతి, దిగుమతుల్లో భారీ వ్యత్యాసమే ఈ విషయాన్ని రూఢీ చేస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే చైనా వైరస్ తీవ్రతను, ఇతర విషయాలను దాచిపెట్టిందని అమెరికా స్పష్టం చేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు కొన్ని రోజులుగా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. చైనా నిర్లక్ష్యాన్ని, పారదర్శకతను ఎండగడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నివేదిక ట్రంప్ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Tags : China, Exports, Imports, America, Homeland Security Department, Coronavirus, Covid 19, Medical Equipment

Advertisement

Next Story

Most Viewed