టీకా ముడిసరుకులు అందడం లేదు: అదర్ పూనావాలా

by Shamantha N |
టీకా ముడిసరుకులు అందడం లేదు: అదర్ పూనావాలా
X

ముంబై: దేశంలో కరోనా టీకా ఉత్పత్తిపై ముడి సరుకుల కొరత ప్రభావం వేస్తున్నదని ప్రపంచ అతిపెద్ద టీకా తయారీదారుల్లో ఒకటైన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అన్నారు. అమెరికా, యూరప్ దేశాలు టీకాకు కావాల్సిన ముడిసరుకుల ఎగుమతులపై నిషేధం విధించాయని వివరించారు. టీకా ఉత్పత్తిలో ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయనపై స్పందిస్తూ ‘నేను స్వయంగా అమెరికా వెళ్లి టీకాకు కావాల్సిన కీలకముడిసరుకుల ఎగుమతులను నిలిపేయడంపై నిరసన తెలియజేయాలనుకుంటున్నాను. దేశంలో కొవాగ్జిన్ సహా అనేక టీకా తయారీదారులపై ఈ నిర్ణయం ప్రభావం పడుతున్నది. ఇతర దేశాల్లోనూ దీని ప్రభావమున్నది. స్వల్ప వ్యవధిలోనే ఇది పరిష్కృతం కావాలి. చైనా నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలని మేం అనుకోవడం లేదు. అక్కడి క్వాలిటీ, దిగుమతిలో సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు.

టీకా ఉత్పత్తిలో తాము ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, ఉత్పత్తిని పెంచాలంటే మరో రూ. 3000 కోట్లు అవసరం పడుతాయని చెప్పారు. ప్రస్తుతం నెలకు 6 నుంచి 6.5 కోట్ల డోసులను తాము ఉత్పత్తి చేస్తున్నామని, జూన్‌లోపు ఈ సంఖ్యను రెట్టింపు చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. ఒకవైపు డోసుల కొరత ఏర్పడిందని రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో సీరం చీఫ్ ఈ వివరాలు తెలియజేయడం ఆందోళనలను మరింత పెంచుతున్నది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డిప్లమసీ పేరటి కోట్లల్లో డోసులను ఇతర దేశాలకు తరలించడంపైనా వ్యతిరేకత వస్తున్నది. ఇక్కడ పౌరులకు టీకాలు అందుబాటులో లేనప్పుడు ఇతర దేశాలకు సరఫరా చేయడం సరికాదన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed