అమెరికాలో 9/11 దాడిని మించి కరోనా విలయం

by vinod kumar |
అమెరికాలో 9/11 దాడిని మించి కరోనా విలయం
X

వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. దీంతో బుధవారం నాటికి అమెరికాలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 9/11 దాడుల్లో చనిపోయిన వారి సంఖ్యను దాటేసింది. ఇప్పటికే కోవిడ్-19 కారణంగా ఐదు వేల మందికి పైగా మృతి చెందగా.. సుమారు రెండు లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి కారణంగా అమెరికాలో 1 లక్ష నుంచి 2 లక్షల మంది మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు.

2001 సెప్టెంబర్ 11న(9/11 దాడి) అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ న్యూయార్క్‌ ట్విన్ టవర్స్‌పై చేసిన దాడిలో దాదాపు 3 వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కరోనా కారణంగా మరణించిన వారు ఇప్పడు ఐదు వేలకు చేరుకున్నారు. మరోవైపు, కరోనా వైరస్ తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో అధికారికంగా ప్రకటించిన 3310 కరోనా మరణాలను అమెరికా ఎప్పుడో దాటేసింది.

వైట్‌హౌస్ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యురాలైన దెబోరా కరోనా వ్యాప్తిపై పలు విషయాలు వెల్లడించారు. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా అమెరికాలో కరోనా మరణాలు 2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని, అది కూడా ప్రస్తుతం ఉన్న కఠిన నిబంధనలు ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తేనే అని చెప్పారు. ఒక వేళ నిబంధనలు పాటించకున్నా, అమెరికా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించకున్నా.. ఈ మరణాలు 15 లక్షల మవనుంచి 22 లక్షల వరకు ఉండొచ్చని ఆమె స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని.. సామాజిక దూరాన్ని తప్పక పాటించాల్సిందేనని టాస్క్‌ఫోర్స్‌లోని మిగతా సభ్యులు కూడా అభిప్రాయపడ్డారు.

Tags : Coronavirus, us, transmission, 9/11 attack, fatalities

Advertisement

Next Story

Most Viewed