కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన అమెరికా

by vinod kumar |
Trump
X

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా గడగడలాడిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో మొదలైన కరోనా కరాళనృత్యం ఇప్పుడు దేశమంతటా పాకింది. అమెరికాలో రోజు రోజుకూ కరోనా మరణాలు వందల సంఖ్యలో ఉంటున్నాయి. మొన్న ఏకంగా 24 గంటల్లోనే రెండు వేల మంది కరోనాతో మృతి చెందారు. బాధితుల సంఖ్య కూడా ఐదున్నర లక్షలకు చేరువలో ఉండటంతో ఆసుపత్రుల్లో కూడా బెడ్లు నిండుకున్నాయి. కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుండటంతో అమెరికా దాన్ని జాతీయ విపత్తుగా గుర్తించింది. అమెరికా దేశ చరిత్రలోనే జాతీయ విపత్తు ప్రకటించడం ఇదే తొలిసారి. కాగా, దేశం మొత్తాన్ని ఒకే సారి ప్రకటించలేదు. కరోనా ప్రభావం చూపే రాష్ట్రాల వారీగా విపత్తును ప్రకటిస్తూ వస్తున్నారు. శనివారం నాడు చివరిగా వ్యోమింగ్ రాష్ట్రానికి కూడా కరోనా విపత్తును ప్రకటించడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది వర్తించింది. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఇక రాష్ట్రాలు కూడా ఫెడరల్ నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. నేరుగా వైట్‌హౌన్ నుంచే రాష్ట్రాలకు నిధులు అందుతాయి. అమెరికాలో ఇప్పటి వరకు 5,33,259 మంది కరోనా బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా 20,597 మంది మృతి చెందారు.

tags: coronavirus, america, national emergency, trump, surge, toll

Advertisement

Next Story

Most Viewed