ఆ తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చిన మానేరు

by Sridhar Babu |
ఆ తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చిన మానేరు
X

దిశ, సిరిసిల్ల: బతికుంటే జన్మదిన వేడుకలు చేసుకోవాల్సింది ఒకరు.. 13ఏళ్లకు కలిగిన సంతానం మరొకరు. చివరకు వాగులో ఆ పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రుల శోకానికి మానేరు సాక్ష్యంగా మిగిలింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి రాజీవ్ నగర్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు సోమవారం మానేరు వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన ఒకరి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

కాగా, ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గల్లంతైన విద్యార్థుల్లో ఒకరైన శ్రీరామ్ క్రాంతి కుమార్‌ పుట్టినరోజు మంగళవారం కావడంతో అతడి కుటుంబ సభ్యులను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. మానేరులో మునిగి చనిపోయిన మరో విద్యార్థి కొంగ రాకేష్.. తమకు పెళ్లైన 13 ఏళ్లకు పుట్టిన సంతానమని చెబుతూ అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది.

అసలేం జరిగిందంటే..!

సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 9 మంది విద్యార్థులు మానేరులోని చెక్ డ్యామ్ దగ్గరకు సైకిళ్లపై వెళ్లారు. వీరంతా సిరిసిల్ల జిల్లా పరిషత్ కుసుమ రామయ్య హైస్కూల్లో 7,8,9 తరగతుల్లో చదువుతున్నారు. సరదాగా కాసేపు ఇసుకలో సైకిల్ తొక్కిన తర్వాత తొమ్మిది మంది విద్యార్థులు ఈత కొడదామని మానేరులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం, ఈత రాకపోవడంతో ఆరుగురు నీటిలో మునిగిపోయారు. మిగతా ముగ్గురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. బయటపడిన విద్యార్థులు ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పడంతో జరిగిన విషాదం గురించి తెలిసింది.

స్థానికుల సమాచారంతో మానేరు దగ్గరకు చేరుకున్న పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో నిన్న మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వర్షం వల్ల గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, మంగళవారం ఉదయం మళ్లీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల్లో కొలిపాక గణేష్, జడల సాయి, తీగల అజయ్‌, కొంగ రాకేశ్‌, శ్రీరామ్ క్రాంతి కుమార్‌ మృతదేహాలు లభ్యమవగా సింగం మనోజ్ ఆచూకీ మంగళవారం సాయంత్రం వరకు కూడా లభించలేదు. అతని ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story