రద్దు చేస్తారా? ఆదేశించాలా? : సుప్రీం కోర్టు

by Shamantha N |   ( Updated:2021-07-16 08:36:07.0  )
supreme court
X

న్యూఢిల్లీ: కన్వర్ యాత్రను రద్దు చేస్తారా? లేక మేమే రద్దు చేస్తూ ఆదేశించాలా? అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై పునరాలోచించేందుకు యూపీకి మరో అవకాశమిస్తున్నామని, తెలుపుతూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కన్వర్ యాత్రను అనుమతిస్తూ తీసుకున్న యోగి సర్కార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు యూపీతోపాటు కేంద్ర ప్రభుత్వమూ అఫిడవిట్ దాఖలు చేశాయి. ఈ యాత్రలో పాల్గొనేవారు, నిర్వహించేవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని నిర్ణయించినట్టు యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. అలాగే, కన్వర్ యాత్ర పురాతన ఆచారమని, మతపరమైన భావాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం తెలిపింది.

అందుకనుగుణంగా గంగాజలాన్ని ట్యాంకులలో ఆయా ప్రదేశాలకు తరలించాలని రాష్ట్రాలకు సూచించింది. గంగాజలం పంపిణీ సమయంలోనూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. దీనిపై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ‘భారత పౌరులమైన మనందరికీ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంటుంది. కావున ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ హక్కుకు భంగం కలిగేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నడుచుకోరాదు. కన్వర్ యాత్రను వందశాతం ఆపేయాలి’ అని సూచించింది. కన్వర్ యాత్ర నిర్వహణపై పునరాలోచించేందుకు యూపీకి మరో అవకాశం ఇస్తున్నామని లేదా తామే రద్దు చేస్తూ ఆదేశిస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story