కరీంనగర్ గ్రానైట్ అక్రమాల్లో కదులుతున్న డొంక… ఆ బూచి మాటునే తతంగం!

by Anukaran |
కరీంనగర్ గ్రానైట్ అక్రమాల్లో కదులుతున్న డొంక… ఆ బూచి మాటునే తతంగం!
X

దిశ ప్రతినిది, కరీంనగర్: ఇంటి దొంగలను ఈశ్వరుడైనా గుర్తించలేడనుకున్నారా లేక మాయా ప్రపంచంలో కొట్టుమిట్టాడారో తెలియదు కానీ గ్రానైట్ బ్లాకుల అక్రమ తరలింపు వ్యవహరంలో మైనింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2013లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇచ్చిన అప్రైజల్ రిపోర్టును ఆధారం చేసుకుని ఇప్పటి వరకు మైనింగ్ ఉన్నతాధికారులు శాఖా పరంగా విచారణ చేపట్టకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఏదేనీ ప్రభుత్వ శాఖలో అవకతవకలు జరిగితే ముందుగా శాఖా పరంగా విచారణ చేసి అప్పటి అధికారులు, ఇతర ఉద్యోగుల నిర్లక్ష్యంపై నివేదికలు తయారు చేసి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆనవాయితీ.

కానీ కరీంనగర్ కు చెందిన గ్రానైట్ మాఫియా అక్రమాల తంతుకు మైనింగ్ డిపార్ట్ మెంట్ లో సపోర్ట్ చేసిన వారెవరు..? నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఎవరు అన్న కోణంలో ఆరా తీసేందుకు ఇంతవరకు ఎందుకు ప్రయత్నించలేదన్నదే అంతు చిక్కకుండా పోయింది. గ్రానైట్ బ్లాక్ తీసేటప్పుడు, దానిని ఎగుమతి చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు ఏంటి? వాటిని ఏ మేరకు అమలు చేశారు? అన్న కోణంలో విచారణ చేపడితే సదరు శాఖలోని అక్రమ ఘనుల గురించి తేటతెల్లం అయ్యేది. ఆయా ఏజెన్సీలు సీనరేజ్ ఫీజు ఎగవేసిన తీరుపై లోతుగా అధ్యయనం చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి.

సాధారణంగా గ్రానైట్ బ్లాక్ ను ఎగుమతికి సిద్దం చేసినప్పుడు వే బిల్లులో చూపిన విధంగా సైజు ఉందా, ఎక్కువ పరిమాణంలో ఉందా అన్న విషయాన్ని పరిశీలించిన తరువాతే వే బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్లాకులకు హ్యామరింగ్ లేదా మార్కింగ్ కూడా చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కానీ క్వారీల నుండి బ్లాకులను తరలిచేంప్పుడు ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకపోవడం వల్లే సీనరేజ్ ఫీజు చెల్లించకుండానే గ్రానైట్ బ్లాకులను తరలించారని స్పష్టం అవుతోంది. పోర్టుల వద్ద గ్రానైట్ బ్లాకులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక ఇచ్చిన వెంటనే నిభందనలు తుంగలో తొక్కిన యంత్రాంగాన్ని గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకోనట్టు తెలుస్తోంది.

ఆదాయపు ఎర…

ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్న బూచి మాటునే ఈ తతంగం అంతా నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. నిబంధనలకు అనుగుణంగా గ్రానైట్ క్వారీల నుండి తరలిస్తున్న బ్లాకుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది. కానీ మొక్కుబడి ఆదాయాన్ని చూపించి అక్రమ మార్గంలో విదేశాలకు బ్లాకులను తరలించడంలో మైనింగ్ యంత్రాంగం కూడా దుస్సాహసం చేసిందా అన్న చర్చ సాగుతోంది.

వెలుగులోకి వచ్చింది కొంతేనా..?

2013లో కరీంనగర్ జిల్లాలోని వివిధ ఏజెన్సీల ద్వారా ఎగుమతి అయిన గ్రానైట్ బ్లాకుల తతంగం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు, ఆ తరువాత దొడ్డి దారిన ఎన్ని బ్లాకులు విదేశాలకు చేరాయోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల సీనరేజీ ఫీజును కోల్పోయి ఉంటుందని అంటున్నారు కొందరు.

Advertisement

Next Story