- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అన్‌లాక్… కండీషన్స్ అప్లయ్
దిశ, న్యూస్ బ్యూరో: ఎట్టకేలకు తాళం తీశారు. కానీ, షరతులు వర్తిస్తాయి. వైరస్ ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా పూర్తిస్థాయి సడలింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం నిషేధిత జాబితాలోని అంశాలు తప్ప దుకాణాలన్నీ యథావిధిగా తెరచుకోనున్నాయి. గ్రామాలు, రాజధాని మధ్య రాకపోకలు షురూ కానున్నాయి. క్యాబ్ సర్వీసులు, కార్లు, టాక్సీలు లాంటి సర్వీసులన్నీ మామూలుగానే పనిచేయనున్నాయి. రాత్రిపూట మాత్రం కర్ఫ్యూ ఇప్పుడున్నట్లుగానే కొనసాగనుంది. వైరస్ బారిన పడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించాల్సిందేనని లేకుంటే వ్యాప్తి చెంది మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వస్తుందని హెచ్చరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్కు లేకుండా బైట కనిపిస్తే వెయ్యి రూపాయల ఫైన్ తప్పదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించిన తర్వాత సడలింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వివరించారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన ఆంక్షలు ఉంటాయని, కదలికలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు, కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్నందున ఎక్కడెక్కడ దుకాణాలు ఎలా తెరుచుకోవాలో జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటిస్తారని సీఎం తెలిపారు. సిటీ బస్సులు మాత్రం తిరగవని స్పష్టం చేశారు. ప్రజల రద్దీని నివారించడానికి దుకాణాలను సరి-బేసి పద్ధతిలో తెరవడమా లేక రోజుమార్చి రోజు తెరవడమా అనేదానిపై జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయిస్తారని తెలిపారు. అన్ని షాపులూ తెరుచుకోవచ్చని, ఎలాంటి ఆంక్షలు లేవని, వ్యాపార లావాదేవీలు మామూలు రోజుల్లో జరిగినట్లుగానే ఉంటాయన్నారు. అయితే శానిటైజర్, మాస్క్, సామాజిక దూరం లాంటి నిబంధనలను ప్రజలు, దుకాణాల యజమానులు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అమలవుతున్న సడలింపుల అనంతర పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా సెలూన్లు కూడా తెరుచుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 1452 కుటుంబాలు కంటైన్మెంట్ జోన్లలో ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రభుత్వం గుర్తించిందని, బైట నుంచి ఎవ్వరూ ఈ జోన్లలోకి వెళ్ళరాదని, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, విజ్ఞులు కరోనాకు మందు, వ్యాక్సీన్ ఇప్పుడిప్పుడే వచ్చే పరిస్థితి లేదని చెప్పారని, ప్రస్తుత పరిస్థితి ఎన్ని నెలలు ఉంటుందో తెలియదని, ఇలాంటప్పుడు మొత్తం ప్రపంచమే కరోనాతో కలిసి జీవించడం మినహా మరో గత్యంతరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జీవితం, కరోనా… రెండూ కలిసి పయనించాల్సిందేనన్నారు. ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు, నిబంధనలు తప్పదన్నారు.
హైదరాబాద్ నగరంలో టాక్సీలు, కార్లలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు, ఆటోల్లో మాత్రం డ్రైవర్ కాకుండా మరో ఇద్దరు ప్రయాణించడానికి అనుమతి ఉంటుందన్నారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని, ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులు చలాన్లు విధిస్తారని తెలిపారు. డ్రైవర్లు సహకరించాలని, ప్రజలు కూడా నిబంధనలను పాటించాలని కోరారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేటు ఆఫీసులు 100% సిబ్బందితో పనిచేస్తాయని, ఎలాంటి ఆంక్షలు లేవని, స్టాఫ్ మొత్తం హాజరుకావచ్చని, కానీ కేంద్రం సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు నిబంధనల ప్రకారం పనిచేయవచ్చన్నారు. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థలు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, స్టేడియంలు, మత ప్రార్థనా స్థలాలు, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్బులు, పబ్‌లు, రెస్టారెంట్లు… ఇవన్నీ ఈ నెల 31 వరకూ మూసివేసే ఉంటాయన్నారు.
ఆంక్షలు సడలించినందున ప్రజలు అవసరం ఉంటేనే రోడ్లమీదకు రావాలని, లేకుంటే ఇండ్లకే పరిమితం కావాలని కేసీఆర్ సూచించారు. 60 ఏళ్ళ వయసు దాటిన వృద్ధులు అత్యవసర పనులు ఉంటే మాత్రమే గడప దాటి బైటకు రావాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులు సైతం బైటకు రావాల్సిన అవసరం లేనప్పుడు ఇంటికే పరిమితం కావాలని, స్వీయ జాగ్రత్తల్లో భాగంగానే ఇవి పాటించాలని సూచించారు. ఇంతకాలం సహకరించినట్లుగానే ప్రజలు ఇకపైన కూడా సహకరించి స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లేదంటే మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు రాక తప్పదని అన్నారు. ఈ నెల 31వ తేదీ తర్వాత మళ్ళీ సమీక్షించి తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.