కేంద్ర హోం శాఖ చేతిలో తెలంగాణ ఐపీఎస్‌ల చిట్టా..!

by Anukaran |   ( Updated:2020-12-06 23:37:00.0  )
కేంద్ర హోం శాఖ చేతిలో తెలంగాణ ఐపీఎస్‌ల చిట్టా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు సేవ చేయడానికి బదులుగా పాలకుల సేవలో తరించిపోతున్నారని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు అందాయి. ఏయే అధికారి ఎలాంటి సందర్భాల్లో ఎవరికి అనుకూలంగా వ్యవహరించారో, నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి బదులుగా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారనే ఫిర్యాదులు ఉదాహరణలతో సహా వెళ్ళాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి సైతం ఈ అంశం వెళ్ళింది. చివరకు డీవోపీటీ అధికారులు కూడా ఈ అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిసింది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక మొదలు జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పోలీసులు అధికార పార్టీకి ఏ విధంగా అనుకూలంగా వ్యవహరించారో, ప్రతిపక్షాలకు చెందినవారిపట్ల దురుసుగా వ్యవహరించారో కొన్ని ఉదాహరణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలోనూ ఈ విషయాలను ఆయన వివరించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్, ఆ తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు వ్యవహరించిన తీరును ఉదాహరణలతో సహా వివరించారు.

లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు లేనప్పటికీ కేంద్ర హోం మంత్రి దృష్టికి వెళ్ళడంతో చివరకు డీవోపీటీ అధికారులకు కూడా చేరింది. ఐపీఎస్ అధికారులు డీవోపీటీ పరిధిలోకి వస్తున్నప్పటికీ విధి నిర్వహణలో వారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలోనే ఉంటారని హోం మంత్రి అమిత్ షా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌కు వివరించినట్లు తెలిసింది. నిర్దిష్టంగా ఫిర్యాదులు అందితే డీవోపీటీ జోక్యం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ పోలీసు అధికారులపై ఫిర్యాదు అందినట్లయితే డీవోపీటీ విభాగంలో ఐపీఎస్ అధికారుల ఏపీఆర్ (యాన్యువల్ పర్‌ఫార్మెన్స్ రిపోర్టు) సమీక్ష సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బండి సంజయ్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ నగరంలో పట్టుబడిన కోటి రూపాయల నగదుకు సంబంధించి వివేక్ పేరును ప్రస్తావించిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్దిష్టంగా బీజేపీ అభ్యర్థికి సంబంధించినవంటూ లిఖితపూర్వకంగా ప్రకటన జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరును బండి సంజయ్ బహిరంగంగానే విమర్శించారు.

డీజీపీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీజీపీ ఆఫీసుకే వచ్చి కూర్చుంటానని సవాలు విసిరారు. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారుల విషయం డీవోపీటీ దాకా వెళ్ళడంతో భవిష్యత్తులో వారి సర్వీసు రికార్డులో ఎలాంటి రిమార్కులు చోటుచేసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story