మరింత సమర్ధవంతంగా కట్టడి చేయండి

by Shyam |
మరింత సమర్ధవంతంగా కట్టడి చేయండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రతీరోజు నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసుల్లో సుమారు 80% మేర పది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయని, కరోనా మృతుల్లో సైతం మెజారిటీ ఈ రాష్ట్రాల్లోనే అని కేంద్ర కేబినెట్ కార్యదర్శి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఈ పది రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత సమర్ధవంతంగా పనిచేయాలని, పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో పాటు కుటుంబ సభ్యులందరి ట్రేసింగ్, టెస్టింగ్ పకడ్బందీగా జరగాలని, 72 గంటల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా గడువు విధించుకోవాలని ఆదేశించారు. ప్రతీ పది లక్షల మంది జనాభాలో రోజూ సగటున 140 టెస్టులు జరగాలని స్పష్టం చేశారు. మొత్తం టెస్టుల్లో పాజిటివిటీ రేటును ఐదు శాతం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ లక్షణాలు ఉన్నట్లయితే విధిగా వారికి ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గడచిన రెండు వారాల గణాంకాలను పరిశీలిస్తే దేశం మొత్తం మీద నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 80%, కరోనా మృతుల్లో సుమారు 89% ఈ పది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. కరోనా మృతుల సంఖ్య మొత్తం పాజిటివ్ కేసుల్లో ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎక్కువ టెస్టులు చేస్తూ సకాలంలో ట్రేసింగ్ చేసినట్లయితే పాజిటివ్ వ్యక్తుల్ని ముందుగానే గుర్తించడం, అవసరమైతే ఆసుపత్రికి తరలించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించడంతో పాటు మృతి చెందే పరిస్థితుల్ని కూడా నివారించవచ్చని వివరించారు. ఇందుకోసం ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమెయిన్ (వెబ్‌సైట్) ద్వారా ఆంబులెన్సుల వివరాలు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే బెడ్‌ల సంఖ్య తదితరాలను ప్రతీరోజూ అప్‌డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని టెలి-మెడిసిన్ విధానం ద్వారా పర్యవేక్షించడంతో పాటు అవసరాన్నిబట్టి వైద్య సిబ్బందిని ఆ ఇళ్ళకు పంపే వ్యూహం అవలంబించాలన్నారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోని వైరస్ తీవ్రత, నమోదవుతున్న కొత్త కేసులు, కరోనాతో చనిపోతున్నవారి సంఖ్య, ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు, వైద్యారోగ్య కేంద్రాల్లో చేస్తున్న టెస్టులు, వైద్య సిబ్బంది కొరత తదితర అంశాలన్నింటిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ తరఫున ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య కార్యదర్శి రిజ్వీ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

Advertisement

Next Story