ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత

by Shamantha N |
ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని పారదోలేందుకు నిధుల సేకరణపై స్పష్టమైన ప్రతిపాదన చేసి ఆమోదించింది. ఎంపీల జీతాలు, అలవెన్సులు, పెన్షన్ లలో ఏడాదిపాటు 30 శాతం కోత విధించే ఆర్డినెన్స్ ను కేంద్ర క్యాబినెట్ సమ్మతించింది. ఈ నిధులను కరోనా పై పోరుకు వినియోగించనుంది. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు స్వచ్ఛందంగా.. సామాజిక బాధ్యతగా భావించి తమ వేతనాల్లో కోత విధించేందుకు నిర్ణయించుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

క్యాబినెట్ సమావేశం ముగిశాక ప్రకాష్ జవదేకర్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. మెంబర్ అఫ్ పార్లమెంట్ యాక్ట్, 1954ను సవరించి ఎంపీల అలవెన్సులు, పెన్షన్ల లో ఏడాదిపాటు(ఏప్రిల్ 1, 2020 నుంచి) 30శాతం కోత విధించేందుకు యూనియన్ క్యాబినెట్ నిర్ణయించిందని వివరించారు. ఈ మొత్తం దేశ సమీకృత నిధికి వెళుతుందని తెలిపారు.

రెండేళ్లు ఎంపీల్యాడ్ కట్..

ఎంపీ ల్యాడ్ (మెంబర్ అఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్) సస్పెన్షన్ పైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2020-21, 2021-22 సంవత్సరాలలో తాత్కాలికంగా ఎంపీ ల్యాడ్ ఫండ్ స్కీమ్ నిలిపివేతకు మంత్రి మండలి ఆమోదించింది. ఈ నిధులను హెల్త్ సర్వీస్, కరోనా మహమ్మారి ప్రభావాన్ని మేనేజ్ చేయడానికి వినియోగించనుంది. సుమారు 7,900 కోట్ల ఈ మొత్తం కూడా సమీకృత నిధికి చేరనుంది.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ రోజు కేంద్ర మంత్రి మండలి సమావేశమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు ప్రధాని అధికార నివాసానికి వెళ్లారు. వీరితో పాటు కొందరు సీనియర్ అధికారులు అక్కడకు చేరారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సభ్యులతో చర్చించారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత నెల 25న మోడీ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో చర్చించారు.

లాక్ డౌన్ పొడిగింపా?

ఈ నెల 14న లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో దాన్ని అలాగే కొనసాగిస్తారా? లేక ఎత్తివేస్తారా? అనే సందేహాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పొడిగించబోమన్నట్టు కేంద్రం సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14వ తేదీ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్త వ్యూహాన్ని అమలు చేయాలని మోడీ కోరిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ లాక్ డౌన్ కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాన్ని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ముందు విలేకరులు పెట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ లాక్ డౌన్ పొడిగింపుపై ఇప్పటివరకు ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు.

Tags: Union cabinet, pay, cut, mp, coronavirus, mplad

Advertisement

Next Story