కొలువుల కోసం కోటి ఆశలు.. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించేనా ?

by Aamani |
కొలువుల కోసం కోటి ఆశలు.. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించేనా ?
X

దిశ, నిర్మల్ కల్చరల్: ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా నోటిఫికేషన్లు అంటూ ఊరిస్తున్నా ఆచరణలో తీవ్రజాప్యం జరుగుతుండటంతో అభ్యర్థులు విసిగివేసారుతున్నారు. కాగా ఇటీవల అతిత్వరలో 80వేల ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. డిగ్రీ, పీజీలు, డీఎడ్, బీఎడ్, తదితర ఉన్నత చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చాలా కాలంగా ప్రిపేరవుతూ కాలం వెళ్లదీస్తున్న వారు చాలామంది ఉన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులతో కొత్తజోన్లు, జిల్లాలు అమల్లోకి రావడంతో నూతన జిల్లాల, జోన్లవారీగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే కొత్త జిల్లాల, జోన్లవారీగా క్యాడర్ విభజన జరగాల్సి ఉంది. ఈ నెల చివరినాటికి ఆ ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఇక జిల్లాలవారీగా ఉద్యోగాలకోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్‌లో నిరుద్యోగులుగా నమోదు చేసుకున్న వారు ఉమ్మడి జిల్లానుండి దాదాపు లక్ష వరకు ఉంటారని అంచనా. ఇక ఉపాధ్యాయ శిక్షణ, డీఎడ్,బీఎడ్ పూర్తిచేసుకున్నవారు 12 వేల పైచిలుకు ఉంటారని భావిస్తున్నారు. వీరంతా గత నాలుగేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లకోసం వేచిచూస్తున్నారు.

టీచర్ పోస్టుల భర్తీ, ప్రశ్నార్ధకమేనా..!

కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. సరిపడా ఉపాధ్యాయులు లేరు. గతేడాది, ఈ విద్యాసంవత్సరం కూడా విద్యా వాలంటీర్లను నియమించలేదు. ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసిన తమకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని జిల్లాలోని బీఎడ్ , డీఎడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజాన్ని చైతన్య పరచాలని ఉద్దేశంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని బీఎడ్ , డీఎడ్ కోర్సులోచేరి శిక్షణ పూర్తి చేశామన్నారు. అయితే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కాకపోవడంతో తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఎడ్ , డీఎడ్ పూర్తి చేసి టెట్ ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలెంటర్లుగా నియమించారన్నారు. ప్రస్తుతం టెట్‌ను కూడా నిర్వహించడం లేదన్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలలు నడవకపోవడం, విద్యా వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయకపోవడంతో తమకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని వారు వాపోతున్నారు. దీంతో తాము ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకుంటున్నామని , ఉపాధ్యాయ శిక్షణ పొందిన తమకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో,అదిగో అంటూ ఉద్యోగాల భర్తీపై అనేకసార్లు ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. తక్షణమే ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలి.

– కుమ్మరి వెంకటేష్
– భారతీయ జనతా యువమోర్చా స్టడీ సర్కిల్ రాష్ట్రకన్వీనర్,నిర్మల్

నాలుగేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న..

గడిచిన నాలుగైదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నాను. మధ్యలో కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు కూడా తగ్గాయి. కుటుంబపోషణ భారమైంది.ఉద్యోగం కోసం సన్నద్ధమవుతూనే ఉన్నాను.ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి.

– సునీల్ కుమార్, నిరుద్యోగి,నిర్మల్

Advertisement

Next Story