ఆ పాత బొమ్మల విలువ రూ. 3.8 కోట్లు

by Sujitha Rachapalli |
ఆ పాత బొమ్మల విలువ రూ. 3.8 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఇంట్లోనూ ఏవో కొన్ని బొమ్మలు ఉండటం సహజం. ఇక పిల్లలున్న ఇల్లయితే వేరే చెప్పక్కర్లేదు, ఇల్లంతా బొమ్మలతోనే నిండిపోయి ఉంటుంది. కాగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని స్టోర్‌బ్రిడ్జ్‌కు చెందిన ఓ జంట.. కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ వార్స్ బొమ్మల్ని మాత్రమే కలెక్ట్ చేస్తూ వచ్చింది. అలా చాలా వరకు బొమ్మలు పోగవడంతో ఏం చేయాలో తెలియక స్టోర్‌ రూమ్‌లో పడేశారు. అయితే అనూహ్యంగా.. ఆ పాత బొమ్మలకు ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు రావడంతో అవాక్కయ్యారు. ఇంతకీ ఎలా?

స్టార్ వార్ సినిమాల పరంపర 1977లో మొదలైంది. అప్పటి నుంచి 2019 వరకు ఆ సిరీస్‌లో మొత్తంగా 9 సినిమాలు వచ్చాయి. స్టార్ వార్స్ క్యారెక్టర్స్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా బోలెడంత బిజినెస్ జరిగింది. అందులో భాగంగానే మార్కెట్‌లోకి వచ్చిన స్టార్ వార్స్ టాయ్స్ చిన్నారులను విపరీతంగా ఆకర్షించాయి. ఈ క్రమంలోనే యూకేకు చెందిన ఓ జంట ఎప్పుడూ స్టార్ వార్స్ బొమ్మలు కొంటూ ఉండేది. అయితే వీరి దగ్గరున్న బొమ్మలను, ఆ ఇంటి పక్కనే ఉన్న మరో జంట కలెక్ట్ చేసింది. కానీ వాటిని ఏం చేయాలో వారికి కూడా ఓ ఆలోచన లేకపోవడంతో స్టోర్ రూమ్‌లో దాచిపెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఆ బ్రిటిష్ జంట కొడుకు ఆ పనికిరాని బొమ్మలను వేలం వేయాలనుకొని, ప్రముఖ ఆక్షనీర్ క్రిస్ ఆస్టన్ దగ్గరకు వెళ్లాడు. ఆ బొమ్మలను పరిశీలించిన ఆస్టన్ వాటిని అరుదైన స్టార్ వార్స్ బొమ్మలుగా పేర్కొన్నాడు. తన జీవితకాలంలో ఇలాంటి స్టార్ వార్స్ బొమ్మల్ని చూడలేదని వ్యాఖ్యనించారు. ఇందులో చాలా బొమ్మలు ప్రస్తుతం మార్కెట్‌లోనే లేవన్నాడు. అంతేకాదు ఆ జంట దగ్గర ఉన్న చాలా బొమ్మలు.. ఇప్పటికీ ప్యాకింగ్‌తోనే ఉండటం విశేషం. కాగా ఆ బొమ్మలను వేలం వేయగా మొత్తం £4,00,000 (రూ. 3.8 కోట్లు) వచ్చాయి. అలా పారేద్దామనుకున్న బొమ్మలు ఆ జంటకు కోట్లాది రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టాయి.

Advertisement

Next Story

Most Viewed