ఇండియాలో లాక్‌డౌన్ అవసరం : అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్

by Shamantha N |   ( Updated:2021-05-01 05:15:00.0  )
ఇండియాలో లాక్‌డౌన్ అవసరం : అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా తాత్కాలికంగానైనా లాక్‌డౌన్ తక్షణం విధించాలని అమెరికా ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ సూచించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించాలని అన్నారు. వెంటనే చేపట్టాల్సినవి, కొంత సమయం పట్టే పనులు, దీర్ఘకాలిక చర్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం ముందు తక్షణావసరాలను వెంటనే సమకూర్చుకోవాలని వివరించారు. ఉదాహరణకు సరిపడా ఆక్సిజన్ సప్లైలు, మెడికేషన్, పీపీఈ కిట్లు లాంటి ఎమర్జెన్సీ అవసరాలను సమీకరించుకోవాలని, దీంతోపాటు తక్షణం లాక్‌డౌన్ విధించే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే, దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలేవీ తీసుకోకుండా కరోనాపై విజయాన్ని ప్రకటించుకోవడం సరికాదని పరోక్షంగా విమర్శించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు అభిప్రాయాలు పంచుకున్నారు.

చైనాలో కరోనా కేసులు విస్ఫోటనంలా కమ్ముకొచ్చినప్పుడు లాక్‌డౌన్ విధించారని, ఇండియాలోనూ అలాంటి చర్యలే అమలు చేయాలని డాక్టర్ ఫౌచీ అన్నారు. గతేడాది తరహాలో ఆరు నెలలు విధించాల్సిన అవసరమేమీ లేదని, కానీ, కరోనా శృంఖలాలను తెంచడానికి కొన్ని వారాలైనా తాత్కాలికంగా లాక్‌డౌన్ విధించిడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఆరు నెలలు లాక్‌డౌన్ విధిస్తే అందరికీ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, తాత్కాలికంగా విధిస్తే మంచిదేనని అన్నారు. ఆక్సిజన్ కోసం ప్రజలు పేషెంట్లను పట్టుకుని వీధుల్లోకి వస్తున్నట్టు తెలిసిందని, ఇక్కడ జాతీయ స్థాయిలో అలాంటి సమస్యలను హ్యాండిల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ లేదని అర్థమవుతున్నదని వివరించారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక బృందముండటం అవసరమని చెప్పారు.

కరోనాపై పోరులో టీకా పంపిణీ కీలక ఆయుధమని, భారత్ కూడా వేగంగా పంపిణీ చేయాలని ఫౌచీ తెలిపారు. 140 కోట్ల జనాభా గల దేశంలో ఇప్పటికి కేవలం రెండు శాతం మంది మాత్రమే సంపూర్ణ వ్యాక్సినేషన్ పొందడం ఆందోళనకరమేనని వివరించారు. ఈ లెక్కన అందరికీ టీకా వేయడం సుదీర్ఘమైన కార్యంగా కనిపిస్తున్నదని అన్నారు. టీకా స్టాక్‌ కోసం ప్రభుత్వం వీలైనన్న టీకా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని, ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. భారత్ అతిపెద్ద టీకా తయారీదారు అని పేర్కొంటూ దేశీయంగా వ్యాక్సిన్ స్టాక్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed