పెళ్లి పెద్దగా మహిళా ఎస్ఐ.. రెండు జంటలకు వివాహం

by Shyam |   ( Updated:2020-08-09 09:01:39.0  )
పెళ్లి పెద్దగా మహిళా ఎస్ఐ.. రెండు జంటలకు వివాహం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ వివాహాలు అధికంగా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే జరుగుతుంటాయి.
కానీ, ఓ పోలీస్ అధికారిని చొరవ తీసుకొని రెండు జంటల ప్రేమ పెండ్లికి పెద్దరికం వహించారు. వారిద్దరి తరఫున పెద్దదిక్కుగా ఉండి తల్లిదండ్రులను ఒప్పించి మరీ వారి సమక్షంలోనే పెండ్లి జరిపించారు. ఈ రెండు జంటల పెండ్లికి గ్రామ పెద్దలను కూడా పిలిపించి అక్షింతలు చల్లించారు.

వివరాళ్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చింతకాని పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా రెడ్డబోయిన ఉమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, పోలీస్ స్టేషన్ పరిధిలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన అనూష, తల్లాడ గ్రామానికి చెందిన గోపీతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. గత కొంతకాలంగా సాఫీగా నడిచిన ప్రేమ ప్రయాణం పెద్దలకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. వారిద్దరి పెండ్లికి ఇరు కుటుంబాలు కూడా నిరాకరించాయి.

దీంతో అనూష ఎస్సై ఉమను ఆశ్రయించింది. ఆమె బాధను అర్ధం చేసుకున్న ఎస్సై ఉమ.. వారిద్దరు కూడా మేజర్లు కూడా కావడంతో.. ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు. వారికి తానే స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చి పెండ్లికి ఒప్పించారు. అనంతరం లచ్చగూడెంలోని ఓ ఆలయంలో అనూష-గోపిల వివాహం దగ్గరుండి జరిపించారు.

అలాగే, స్టేషన్ పరిధిలోనే ఉన్న గాంధీనగర్‌కు చెందిన మరో జంట వ్యవహారాన్ని కూడా ఇట్టే పరిష్కరించారు. స్వప్న-సాయికుమార్ అనే జంట గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెండ్లికి నిరాకరించారని.. ఏకంగా 3 నెలలుగా సహజీవం చేస్తున్నారు. పైగా ప్రియురాలు గర్భవతి.

సమాజం తప్పుగా ఆలోచిస్తోందని భావించిన స్వప్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన గోడును చెప్పుకుంది. వెంటనే ప్రియుడు సాయికుమార్‌, తల్లిదండ్రులను పిలిపించిన ఎస్సై ఉమ వారిని కూడా పెండ్లికి ఒప్పించారు. 3 నెలల సహజీవనం తర్వాత వీరి పెండ్లికి పోలీస్ స్టేషన్ వేదికైంది. ఓ పోలీస్ అధికారిని దగ్గరుండి ప్రేమ పెండ్లిలు జరిపించడం గమనార్హం.

Advertisement

Next Story