తుంగభద్ర పుష్కరాలకు సర్వం సిద్ధం

by Shyam |
తుంగభద్ర పుష్కరాలకు సర్వం సిద్ధం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పుష్కరాలలో తుంగభద్ర పుష్కరాలు ముఖ్యమైనవి. ఎక్కడో కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మించిన తుంగ, భద్ర నదులు వేర్వేరుగా ప్రవహిస్తూ కూడ్లి అనే పట్టణంలో తుంగభద్రగా ఆవిర్భవించి ఏపీలో కర్నూలు జిల్లాలో ప్రవేశించి అక్కడి నుండి తెలంగాణలోని కుట్కనూర్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించి చివరగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసిపోతుంది. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తుంది. ఇక శుక్రవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటా 21 నిమిషాలకు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తుంగభద్ర పుష్కరాలు ప్రారంభంకానున్నాయి.

గతంలో 2008 డిసెంబర్‌లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా కర్నాటకలో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. కాని ప్రస్తుతం కోవిడ్ కారణంగా పుష్కరాల జరపాలా వద్ద అనే సందేహంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తుంగభ్రద పుష్కరాల కోసం చివరగా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా భక్తుల సౌకర్యాల కోసం రూ.2.5కోట్లతో పుష్కరఘాట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం నాలుగు పుష్కరఘాట్ల వద్ద ప్రభుత్వం భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా అలంపూర్ జోగులాంబ దేవాలయం వద్ద భక్తుల తాకిడి అధికంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కొవిడ్ నిబంధనలు తప్పనిసరి:

కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో నదిలో పుణ్యస్నానాలను అచరించేందుకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు నిర్వహించనున్న పుష్కరాల్లో పుణ్యస్నానాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. విడతల వారీగా భక్తులను నదుల్లోకి అనుమతిస్తామని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ ఆ క్రతువును ఆచరించాలని సూచించింది. ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా పది సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణులు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పుష్కరస్నానం చేసేందుకు రాకపోవడం మంచిదని సూచించారు. అలాగే భక్తులు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే రావాలని అదేవిధంగా వచ్చే ప్రతి భక్తుని కూడా పుష్కర ఘాట్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారని, ఒక్క వేళ్ళ అక్కడ ఉష్ణోగత్ర ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారణయితే అలాంటి వారిని పుణ్యస్నానాలకు అనుమతించరు.

భక్తులను ఒకేసారి కాకుండా విడతల వారీగా నదిలోకి అనుమతించడంతో పాటు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ పుణ్యస్నానాలు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు అనుసరిస్తూనే పిండ ప్రదానాలూ చేసుకునే అవకాశం కల్పంచారు. ఆలయాల్లోనూ భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని, ఘాట్‌ వద్ద త్వరగా పూజలు ముగించుకోని, నదిలో ఎలాంటి పూజా పదార్థాలు వేయకూడదని సూచించారు. అదే సమయంలో నదితీర ప్రాంతంలో పూర్తిగా ప్లాస్టిక్‌ సంచులు వినియోగించరాదని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Advertisement

Next Story