TSPSC నోటిఫికేషన్ పెండింగ్‌కు కారణం ఇదేనా..!

by Anukaran |   ( Updated:2021-09-02 00:28:14.0  )
Job notifications, TSPSC
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నిరుద్యోగులకు పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఉప ఎన్నికలు, మండలి, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వంటి పలు కారణాలతో మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. 2018 నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క నోటిఫికేషన్​కూడా ప్రకటించలేదు. గ్రూప్ – 1, గ్రూప్ – 2, గ్రూప్ – 3, గ్రూప్ -4లో 3160 పోస్టులకు గతంలో అనుమతి ఇచ్చినా.. ఇప్పుడు వాటిని భర్తీ చేసేందుకు అవకాశం లేదు. ఆర్థిక శాఖ ఆమోదం పొంది అనుమతి వచ్చిన పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే గడువు ఏడాదిలోపు మాత్రమే. దీంతో ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ చేతిలో ఒక్క పోస్టు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ చేయాలంటే మళ్లీ అనుమతి తప్పనిసరిగా మారింది. దీంతో ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది, ఆర్థిక శాఖ అనుమతి రావాల్సిందే.

పెండింగ్ ఎక్కడ..?

రాష్ట్రంలో 2014 తర్వాత ప్రధానంగా ఆశపడ్డ గ్రూప్​ –1 ఉద్యోగాల నోటిఫికేషన్​ఒక్కటి కూడా విడుదల చేయలేదు. గ్రూప్​–2, 3, 4 ఉద్యోగాలకు కూడా 2017లో అనుమతి ఇచ్చినా ఇప్పుడు వాటికి నోటిఫికేషన్లు జారీ చేయడం సాధ్యం కాదు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇచ్చామంటూ పదే పదే చెప్పుకొస్తోంది. టీఎస్‌పీఎస్సీలోనే పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పుతున్నారు. కానీ, వాటికి మళ్లీ అనుమతి రావాల్సిందేనని టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పబ్లిక్​ సర్వీసు కమిషన్​చేతిలో ఒక్క ఉద్యోగం కూడా లేదని తేలిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీని తర్వాత వెను వెంటనే నోటిఫికేషన్లు వస్తాయని ఆశించారు. కానీ, ఉద్యోగుల విభజన, పోస్టుల ఖరారు, ఖాళీల వివరాలు తేల్చడంలోనే ప్రభుత్వం సాగదీస్తోంది. దీంతో ఇప్పట్లో నోటిఫికేషన్లు వస్తాయనే ఆశలు సన్నగిల్లుతున్నాయి.

ప్రతిపాదనలు ఇవ్వడం లేదు

తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటన కింద ప్రభుత్వం 138 పోస్టులు గుర్తించింది. ఈ మేరకు 2018 జూన్‌ 2న ప్రకటన వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. అదే సమయంలో కొత్త జోనల్‌ విధానం వచ్చే వరకు నియామక ప్రకటనలు నిలిపేయాలంటూ ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఆ తర్వాత నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన అనంతరం వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేయాలని ఏడాది క్రితమే టీఎస్‌పీఎస్సీ.. ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ ప్రక్రియ పూర్తికాలేదు. గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2, 3 పోస్టులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు పెండింగ్‌లో పడిపోయాయి. ఆ ఉద్యోగాల జాబితాను కమిషన్‌ సంబంధిత విభాగాలకు తిప్పిపంపింది. నూతన జోనల్‌ విధానం కింద పునర్‌వ్యవస్థీకరించి ప్రతిపాదనలు పంపించాలని కోరింది. కానీ ఆయా విభాగాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిపాదనలు రావడం లేదు.

ఈ ఏడాది ఒక్క నోటిఫికేషన్​లేదు

2014 నుంచి 2021 వరకు టీఎస్‌‌పీఎస్సీ 1‌‌5 నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే 2020లో కేవలం ఒక్కటంటే ఒక్కటే జారీ చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కటి కూడా విడుదల కాలేదు. టీఎస్2పీఎస్సీ 105 నోటిఫికేషన్లు ఇవ్వగా.. వాటిలో 51 నోటిఫికేషన్లు 2017లోనే ఇచ్చింది. ఆ ఏడాదే మూడింట రెండొంతుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. 2015లో 13, 2016లో 12, 2018లో 25 నోటిఫికేషన్లు ఇచ్చారు. కమిషన్ గత మూడేండ్లలో నాలుగే నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. 2019లో మూడు, 2020లో ఒకటే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ఏడేండ్లలో 39,952 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపి, నియామకాలు చేపట్టాలని టీఎస్‌‌పీఎస్సీకి పంపించింది. కానీ వీటిలో పలు శాఖల నుంచి ఇంకా 3,160 పోస్టులు వివరాలు కూడా టీఎస్‌‌పీఎస్సీకి అందాల్సి ఉంది.

105 నోటిఫికేషన్లపై 631 కోర్టు కేసులు

టీఎస్‌‌పీఎస్సీ గత ఏడేండ్లలో మొత్తం 135 నోటిఫికేషన్లు విడుదల చేయగా, వాటిలో 105 రిక్రూట్‌‌మెంట్‌‌ నోటిఫికేషన్లు ఉన్నాయి. మిగిలిన 30 డిపార్ట్‌‌మెంటల్‌‌ అండ్‌‌ ఆఫ్‌‌ ఇయర్లీ, సీఏఎస్‌‌ ఎగ్జామ్స్‌‌ నోటిఫికేషన్లున్నాయి. ఇప్పటివరకు కమిషన్​36,601 పోస్టుల భర్తీకి (128 గ్రూప్‌‌–1 పోస్టులతో కలిపి) 105 నోటిఫికేషన్లను విడుదల చేసింది. అత్యధికంగా 2017లో 26,644 పోస్టుల భర్తీ కోసం 51 నోటిఫికేషన్లు ఇచ్చింది. సర్కారు భర్తీ చేయాలని ఇచ్చిన కొన్ని పోస్టులకు వివాదాలు తప్పడం లేదు. నోటిఫికేషన్‌‌ రాగానే వెంటనే అది కోర్టుమెట్లెక్కుతోంది. 2019 ఏడాది చివరి నాటికే 631 కోర్టు కేసులు నమోదయ్యాయి. మెడికల్‌‌ అండ్‌‌ హెల్త్‌‌, గ్రూప్‌‌ –2, టీఆర్‌‌టీ, గురుకుల టీచర్స్‌‌ పోస్టులన్నీ కోర్టుకెక్కాయి. ఇంకా విద్యార్హత, జిల్లాల పంచాయతీ అంటూ అనేక రకాల వివాదాలను ఎదుర్కొంది.

3160 పోస్టులు లేనట్టే

టీఎస్‌పీఎస్సీ నివేదిక ప్రకారం.. మొత్తం 39,952 పోస్టులకు అనుమతి వస్తే అందులో 36,581 పోస్టులను నోటిఫై చేసి 30,594 పోస్టులను భర్తీ చేశారు. ఇంకా 9358 పోస్టుల్లో 3160పోస్టులకు నోటిఫికేషన్​ జారీ చేసే సమయంలో పెండింగ్​పడింది. మిగిలిన పోస్టులు కోర్టు కేసుల్లో నలుగుతున్నాయి. అయితే 3160 పోస్టులు మాత్రం ఇక లేనట్టే. వీటన్నింటికీ మళ్లీ ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంటోంది. గతంలోనే వీటిని గుర్తించగా.. ఇప్పుడు ఈ పోస్టులకు అనుమతి వస్తుందా అనేది అనుమానమే.

39 శాతం ఖాళీనే

రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఇది ప్రభుత్వం నియమించిన కమిటీ సూచించిన లెక్కలే. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. పీఆర్సీ నివేదిక ప్రకారం మొత్తం పోస్టుల్లో 39 శాతం ఖాళీలే ఉన్నట్లు స్పష్టమైంది. రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలు ఉండగా 5 శాఖల్లో మాత్రమే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్కూల్​ఎడ్యుకేషన్, హోం, రెవెన్యూ, హెల్త్, పంచాయతీ రాజ్ శాఖల్లో మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఐదు శాఖల్లోనే 3,42,938 (69.80%) మంజూరైన ఉద్యోగాలుండగా, పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2,30,799 (79.89%) మంది వీటిలోనే ఉన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ శాఖల్లో 50,400 మంది కాంట్రాక్ట్,​58,128 మంది ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు 16.81 శాతంగా ఉన్నారు.

2‌‌014 నుంచి పోస్టుల భర్తీ ఇలా..!

రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అనుమతి వచ్చినవి నోటిఫైడ్ భర్తీచేసినవి ఖాళీలు

టీఎస్‌పీఎస్సీ 39,952 36,581 30,594 9,358
టీఎస్‌ఎల్పీఆర్‌బీ 31,972 31,972 31,972 —-
టీఆర్‌ఈఐఆర్‌బీ 7,016 3,678 3,623 3,393
ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ 1,466 —- —- 1,466
డీపీసీ 16,656 11,494 11,278 5,378
ఇతర పోస్టులు 53,264 49,174 49,174 4,090

మొత్తం 1,50,326 1,32,899 1,26,641 23,685

Advertisement

Next Story

Most Viewed