పోలీస్ ఫ్లాగ్ డే గ్రాండ్‌గా ఉండాలి : డీజీపీ

by Shyam |
పోలీస్ ఫ్లాగ్ డే గ్రాండ్‌గా ఉండాలి : డీజీపీ
X

డీజీపీ మహేందర్ రెడ్డి

దిశ, క్రైమ్ బ్యూరో :

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో అక్టోబర్ 21 నుంచి 31 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో శనివారం పోలీసు అమర వీరుల దినోత్సవాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ పోలీసు అమరవీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించాలన్నారు. ఇందులో పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మన దేశంలోని అంతర్గత భద్రతలో కీలక పాత్ర వహిస్తూ విధి నిర్వహణలో అమరులైన, వైకల్యం పొందిన పోలీసులు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీస్ ఫ్లాగ్ డే ఫండ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ పది రోజుల్లో ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలు, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న కష్టాలు, పోలీసుల నుంచి ప్రజలు ఎలాంటి సేవలను ఆశిస్తున్నారనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ అమర వీరులపై హైదరాబాద్‌లో ఛాయా చిత్ర ప్రదర్శన, విద్యార్థినీ- విద్యార్థులకు వ్యాస రచన, వకృత్వ పోటీలు, వివిధ స్థాయిల్లో పోలీస్ అధికారులకు కూడా వ్యాసరచన పోటీలను వెబినార్ ద్వారా నిర్వహించాలన్నారు.

ఏదైనా ఒక వీధికి గానీ, కాలనీకి గానీ పోలీసు అమరవీరుల పేర్లను పెట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సీనియర్ పోలీస్ అధికారులు పోలీస్ అమరుల ఇళ్లను సందర్శించి వారి బాగోగులు, వారి అవసరాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీజీపీలు గోవింద్ సింగ్, రాజీవ్ రతన్, జితేందర్, శివథర్ రెడ్డి, అభిలాష బిస్ట్, ఐజీలు నవీన్ చంద్, నాగిరెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story