వలస కూలీలకు అండగా..

by Shyam |
వలస కూలీలకు అండగా..
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతోపాటు, నిత్యావసర సరుకులు కొనుగోలుకు రూ.1,500 అందజేస్తోంది. నగరవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులకు కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. వీరికి ఒక్కొక్కరికి ప్రభుత్వం 12 కిలోల బియ్యంతో పాటు రూ.500 అందజేస్తోంది. ఇప్పటికే వలస కార్మికులకు బియ్యం, డబ్బులను పంపిణీ చేశారు. కానీ, జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఆహారం, షెల్టర్ల కోసం వలస కార్మికులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. దీంతో జిల్లా పరిధిలోని తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఇప్పటికే సాయం అందని వలస కార్మికుల జాబితాను సిద్ధం చేసి ఆహార పంపిణీకి చర్యలు చేపడుతున్నారు.

మొదటి విడతలో 34 వేలకు..

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించింది. అయితే, ఈ ప్రకటనను రెండ్రోజుల ముందుగానే చేసినా.. ఆ మరుసటి రోజునే లాక్‌డౌన్ ప్రకటన చేస్తారని ప్రజలెవరూ ఊహించలేదు. దీంతో ఉపాధి కోసం నగరాలకు వలసొచ్చిన కార్మికులు, కూలీలు ఎక్కడి వాళ్లక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. దీంతో వీరందరినీ ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల వ్యాప్తంగా మొదటి విడతలో సుమారు 34 వేల 283 మందికి బియ్యం, రూ.500 అందజేసింది. వీటిలో హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 22,054 మందికి, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 12,229 మందికి పంపిణీ పూర్తి చేశారు.

మరో 38 వేల మంది వలస కూలీలకు..

హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడంతో వలస కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్, ఏపీ రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఉపాధి కోసం వస్తుంటారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, స్థానికుల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రభుత్వ సాయమందని మరో 38 వేల 340 మందిని గుర్తించారు. ఇందులో హైదరాబాద్ డివిజన్ పరిధిలోనే 23,896 మంది ఉండగా.. సికింద్రాబాద్ డివిజన్‌లో 4,444 మంది వలస కూలీలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరందరికీ 12 కిలోల బియ్యం, రూ.500ను అందజేయనున్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లో ఈ పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, హైదరాబాద్ డివిజన్‌లో త్వరలో ప్రారంభం కానుంది.

Tags : Hyderabad collector, Corona effet, rice distribution, Migrant labour in Hyd

Advertisement

Next Story

Most Viewed