‘ఆశా’లకు వ్యాక్సినేషన్ టార్గెట్..

by vinod kumar |   ( Updated:2021-07-05 12:05:25.0  )
asha-workers 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీకాల పంపిణీ మరింత ముమ్మరంగా జరిగేందుకు ప్రధాన కార్యదర్శి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతీ ‘ఆశా‘ కార్యకర్త రోజుకు కనీసంగా 30 మందికి టీకాలు ఇప్పించాలని టార్గెట్ విధించారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోని వైద్యాధికారులు చొరవ తీసుకోవాలని, ప్రతీ రోజు సమీక్షించాలని స్పష్టంచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సైతం అన్ని జోన్లు సగటున రోజుకు వెయ్యి మందికి టీకాలు ఇప్పించేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి టీకాలు తీసుకునేలా అన్ని కేంద్రాల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ తదితరులతో సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో పై స్పష్టత ఇచ్చారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్వయం సహాయక మహిళా సంఘంలోని సభ్యులందరికీ విధిగా టీకాలు ఇప్పించాలని, ఇందుకు కమిషనర్ బాధ్యత తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు ఆటోలపై డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రచారం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లందరినీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి ఆయా డివిజన్లలోని ప్రజలకు వ్యాక్సిన్ కేంద్రాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ జోన్‌లో రోజుకు వెయ్యి టీకాలు కనీసంగా వేయించేలా జోనల్ కమిషనర్లకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. కొత్త రేషను కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తుల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story