- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే టీఆర్ఎస్ ప్లీనరీ.. రాజకీయాలపై ఏడు తీర్మానాలు
దిశ, తెలంగాణ బ్యూరో : మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న పార్టీ ప్లీనరీని గ్రాండ్‌గా నిర్వహించడానికి టీఆర్ఎస్ పార్టీ సకల ఏర్పాట్లు చేసింది. పార్టీ ఉనికిలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా యావత్తు రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ బలాన్ని చూపించేలా జరగనున్నది. ఆరు వేల మంది ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాన్ని పంపిన పార్టీ నాయకత్వం అందరూ గులాబీ డ్రెస్సులో రావాల్సిందిగా హుకుం జారీచేసింది. వేదిక మీద వంద మంది ప్రతినిధులు ఆశీనులయ్యేలా హైటెక్స్ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు జరిగాయి. పార్టీ పుట్టినప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ లాంఛనంగా మరోసారి చీఫ్‌గా ఎన్నిక కాబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ప్లీనరీలో ఏడు రాజకీయ తీర్మానాలు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.-
అక్కడి వాళ్లు అక్కడే..
ప్రతీ ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ నెలలో ప్లీనరీ జరగడం ఆనవాయితీ. అయితే 2018లో అసెంబ్లీ రద్దు కావడానికి ముందు కొంపల్లిలో జరిగింది. 2019లో లోక్‌సభ ఎన్నికల కారణంగా, గతేడాది లాక్‌డౌన్ కారణంగా, ఈసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా జరగలేదు. ఈ ఏడాది ఇరవై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లీనరీని హైదరాబాద్‌లో, విజయగర్జన సభను వరంగల్‌లో వచ్చే నెలలో జరపడానికి నిర్ణయం జరిగింది. ఆ ప్రకారం పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు తన ప్రారంభోపన్యాసంతో ప్లీనరీని మొదలుపెట్టనున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రచారంలో ఉన్న నేతలంతా అక్కడే ఉండాలని, ప్లీనరీకి రావాల్సిన అవసరం లేదని ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయి.
కేసీఆర్ అధ్యక్షోపన్యాసం
సెక్రటరీ జనరల్ కేశవరావు 9వ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి 14 ఏళ్ల పాటు స్వరాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం, ఆ తర్వాత సాకారమైన లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దడం.. లాంటి అంశాలను ప్రస్తావించనున్నారు. అనంతరం ఉదయం 11:30 గంటలకు పార్టీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 18 సెట్ల నామినేషన్లు కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ దాఖలయ్యాయి. కొత్త అధ్యక్షుడి పదవి కోసం కేవలం కేసీఆర్ పేరు మీదనే ప్రపోజల్స్ వచ్చినందు వల్ల ఆయన ఎన్నికల లాంఛనమే కానున్నది. కార్యదర్శి తన ప్రతిపాదనలను ప్లీనరీ ముందు ఉంచిన తర్వాత సభ్యులు ఫార్మాలిటీగా ఎన్నుకోనున్నారు. అనంతరం సభకు కృతజ్ఞత తెలుపుతూ నూతన అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ఏడు రాజకీయ తీర్మానాలు
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తీర్మానాల కమిటీ చైర్మన్ హోదాలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిపై చర్చ జరిగిన అనంతరం ఆమోదం పొందనున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటిపారుదల, సంక్షేమం, దళిత సాధికారత, నూతన అధ్యక్షుడికి అభినందన తదితర తీర్మానాలను ప్లీనరీ ఆమోదించనున్నది. కేంద్ర వ్యవసాయ చట్టాలను పూర్తిగా వ్యతిరేకించి ఒక రోజు బంద్ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ప్లీనరీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, సహకార వ్యవస్థను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా సాగునీటి ప్రాజెక్టుల్లాంటి విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం, నూతన విద్యుత్ బిల్లు ద్వారా రాష్ట్రాలపై పెత్తనం చేయడం.. లాంటి అంశాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున వీటిపై ప్లీనరీలో ఎలాంటి తీర్మానాలు వస్తాయన్నది ఆసక్తి పుట్టిస్తున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్నందున నూతన అధ్యక్షుడి హోదాలో మధ్యాహ్నం సెషన్‌లో రాజకీయ ప్రసంగాన్ని చేసే అవకాశముంది.
గులాబీమయంగా నగరం
ప్లీనరీ సందర్భంగా ఆహ్వానితులకు మాత్రమే అనుమతి అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందుకోసం ఇన్విటేషన్లతో పాటు ప్రత్యేక పాస్‌లను కూడా జారీ చేశారు. ప్లీనరీకి హాజరయ్యేవారంతా విధిగా గులాబీ డ్రెస్‌లోనే రావాలని ఆర్డర్ వేశారు. నగరాన్ని గులాబీ తోరణాలతో స్థానిక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అలంకరించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం ప్రదర్శించాయి. నగరంలోని అనేక కూడలి ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, తోరణాలు వెలిశాయి. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కట్టినా అధికారులు శ్రుతిమించిన రాజభక్తినే ప్రదర్శిస్తున్నారు. ప్లీనరీకి దారితీసే రోడ్లన్నింటిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నగర పోలీసులు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటైంది.
తెలంగాణ వంటకాల ఘుమఘుమలు
ప్లీనరీకి సుమారు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నందున తెలంగాణ వంటకాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా, తలకాయ కూర, రుమాల్ రోటి, మిర్చికా సాలన్, బైంగన్ చట్నీ, ఉలవచారు, పచ్చిపులుసు.. తదితర మొత్తం 29 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని స్వీట్ ఐటెమ్స్ సరేసరి. వంటలకు, సప్లయ్ చేయడానికి 500 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఒకేసారి మూడు వేల మంది భోజనం చేసేందుకు వీలుగా అతి పెద్ద డైనింగ్ హాల్‌ను తీర్చిదిద్దారు. వంటల కోసమే ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి బాధ్యతలను అప్పజెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
35 కౌంటర్లు ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకునేందుకు 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వలంటీర్‌ను నియమించారు. అదే విధంగా 33 నియోజకవర్గాలకు ఒక వలంటీర్‌తో పాటు వారికి సహాయసహకారాలు అందజేసేందుకు కొంత మందిని వలంటీర్లను నియమించారు. ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచే పేర్ల నమోదు ప్రారంభమవుతుంది.