కేసీఆర్ ఇలాకాలో ‘వంటేరు’ హల్‌‌చల్ ..150 మంది గులాబీ లీడర్లు యూ టర్న్?

by Anukaran |   ( Updated:2021-11-30 08:23:58.0  )
కేసీఆర్ ఇలాకాలో ‘వంటేరు’ హల్‌‌చల్ ..150 మంది గులాబీ లీడర్లు యూ టర్న్?
X

దిశ, గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం తెరాస పార్టీలో తాజా మాజీ అటవీ శాఖ కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తూ పార్టీ పరువును గంగపాలు చేస్తున్నారని, గతంలో తనతో పాటు పని చేసిన నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చి నిజమైన ఉద్యమ కారులు, సీనియర్ నాయకుల నోట్లో మట్టి కోడుతున్నారని టాక్ వినిపిస్తోంది. గజ్వేల్ తెరాస పార్టీకి తానే సర్వం అని స్వప్రకటన చేసుకుంటూ నియంతలా వ్యవహరిస్తున్నాడని, ప్రశాంతంగా ఉన్న పార్టీలో ముసలం సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని గజ్వేల్ పట్టణ తెరాస ఉద్యమ, సీనియర్ నాయకులు మూకుమ్మడిగా ఆరోపిస్తున్నారు.

గజ్వేల్ పట్టణంలోని కోలాభిరామ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం సుమారు 150 మందితో పట్టణ పార్టీ తెరాస నాయకులు సమావేశం నిర్వహించారు. జై తెలంగాణా, జై కేసీఆర్, జై హరీష్ రావు నినాదాలతో ప్రారంభమైన సభ వంటేరు ఆగడాలకు పార్టీలో అడ్డుకట్ట వేయాలన్న నినాదంతో సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్ పట్టణ తెరాస అధ్యక్షుడి విషయంలో ప్రతాప్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి తన అనుచరుడికి కట్టబెట్టారని ఆరోపించారు. ప్రతాప్ రెడ్డి నియమించిన కమిటీ వారి సొంత కమిటేనని అధికారికంగా నియమాలను అనుసరించి కమిటీ వేయలేదన్నారు. స్వ పక్షంలో విపక్షంలా వ్యవహరిస్తూ స్థానికంగా పార్టీకి మచ్చ తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నాడని ఆరోపించారు. స్వ పక్షంలో విపక్షంలా ఉంటూ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాడని ఆరోపించారు.

వంటేరు ఆగడాలపై తెరాస అధిష్టానం దృష్టి సారించి అడ్డుకట్ట వేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ప్రతాప్ రెడ్డిని తొలగించాలని కోరారు. మీడియాతో తెరాస సీనియర్, ఉద్యమ నాయకులు వూడెం క్రిష్ణా రెడ్డి, ఆకుల దేవేందర్, కళ్యాణ్ కార్ నర్సింగరావు, గాడిపల్లి శ్రీనివాస్, మామిళ్ళ నాగు ముదిరాజ్, ఎండీ షరీష్, ఖాసీం, పులి బాల చంద్రంలు మాట్లాడగా కార్యక్రమంలో నాయకులు అనుముల మల్లేష్ గౌడ్, నిమ్మ రమేష్, సంగాపూర్ ఎల్లం, ఎండీ లతీఫ్, ఖరీం, షహేద్, వెంకట్ గౌడ్‌లతో పాటు పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు. సీఎం ఇలాకాలో తెరాస నాయకుల సమావేశం గజ్వేల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ సమావేశం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని తెరాస శ్రేణులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story