- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రమశిక్షణ తప్పింది.. గులాబీకి గుచ్చుకుంటున్న సొంత ముళ్లులు
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీకి సొంత ముళ్లే గుచ్చుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల వివాదస్పద వ్యాఖ్యలు పార్టీ పరువును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతుంది. ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు లేని పరిస్థితి రెండోసారి పవర్‌లోకి వచ్చాక మారిపోయింది. గీత దాటేవారిని పెద్దలు కట్టడి చేయలేకపోతున్నారు. ఓ వైపు సమర్థించుకోలేక, మరోవైపు ఖండించలేక తల పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఎక్కడ సందు దొరుకుతుండా అంటూ ఎదురుచూస్తున్న బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. అటు కాంగ్రెస్ దాన్ని అందుకోవడంలో వెనకబడుతోంది.
అప్పుడు హద్దుల్లేనే కదా..!
పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మాట తీరు పొదుపుగానే ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీలో ఇంకా ఎక్కువ. పార్టీ పెద్దను కాదని వ్యతిరేకంగా మాట్లాడితే వేటు తప్పదు. గతంలో చాలా సందర్భాల్లో ఇది స్పష్టమైంది. టీఆర్‌ఎస్ తొలిటర్మ్‌లో పార్టీ నేతలు క్రమశిక్షణతో ఉన్నట్టు వ్యవహరించారు. ఎవరూ గీత దాటేవారు కాదు. దీంతో టీఆర్‌ఎస్‌కు పెద్దగా వ్యతిరేకత రాలేదు.
ఇప్పుడేమైంది..?
ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు పార్టీ ప్రతిష్టను ప్రశ్నార్థకంలో పడేస్తోంది. వాళ్ల వైఖరి అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారుతోంది. అసలు ఎమ్మెల్యేలు ఎందుకు అలా మాట్లాడుతున్నారనే సందేహం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారుతోంది. ముందు ఏదోదో మాట్లాడేయటం విమర్శలు వచ్చాక మాటలను వక్రీకరించారని చెప్పడం లేకుంటే సారీ చెప్పడం పరిపాటైంది.
తొందరపడి మాట్లాడుతున్నారా?
మొన్నటిదాకా టీఆర్‌ఎస్‌లో కాబోయే సీఎం కేటీఆర్ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు భజన చేశారు. కేటీఆర్‌కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కోరస్ అందుకున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. మంత్రులకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కామెంట్లు తగ్గినా వివాదస్పద వ్యాఖ్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
మంత్రి ఈటలతో మొదలు
మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు ఇంకా పార్టీ నేతల్లో తిరుగుతూనే ఉన్నాయి. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదని, పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని బతికొచ్చినోన్ని అసలే కాదని, తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్లం కాదంటూ చేసిన ప్రకటన వివాదస్పదమైంది. ‘అసలోడెవ్వడో, నకిలోడెవ్వడో తెలవాల్సిన అక్కర ఉంటది. దొంగలెవరో, దొరలెవరో తెలవాల్సిన అవసరం ఉంటది. రాజకీయాల్లో ద్రోహులెవ్వరో, మోసగాళ్లెవరో అసలు సిసలైన వాడెవ్వడో తెలవాల్సిన అక్కర ఉంటది’.. అంటూ చేసిన వ్యాఖ్యలు చాలా మంది టీఆర్ఎస్ తొలితరం నేతలకు సంతోషాన్ని ఇచ్చినా అధిష్ఠానానికి మాత్రం సెగ తగిలిందని పార్టీ నేతలు అంటున్నారు. ఆ తర్వాత కోకాపేటలో ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని చేసిన కామెంట్స్‌పై గంగపుత్రుల సామాజికవర్గం గరమైంది. దీంతో మంత్రి క్షమాపణ చెప్పడమే కాకుండా వారిని సమర్థించేందుకు అష్టకష్టాలు పడ్డారు.
విరాళాలపై వివాదం
ఇక సీఎం కేసీఆర్ గతంలో హిందుగాళ్లు… బొందుగాళ్లు అనే వ్యాఖ్యలు చాలా రోజులు ఇబ్బందులు తెచ్చింది. దీనిపై కేంద్ర పెద్దలే తలదూర్చారు. దాన్ని మరిపించేందుకు సీఎం చేసిన యాగాలకు విస్తృత ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, పర్కాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాటలు కూడా మరింత వేడెక్కించారు. ఆ తర్వాత మళ్లీ ధర్మారెడ్డి హన్మకొండలో ఓసీ జేఏసీ సభలో ఓ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదని, ఎక్కడ చూసినా వాళ్లే ఉన్నారని, మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దానిపై స్పందించారు. ఈ వ్యాఖ్యలకు సూటిగా సమాధానమిస్తూ తాము చదువుకున్నామని చదువు కొనలేదని, అయినా చదువు అమ్ముకునోటోళ్లం అసలే కాదంటూ ధర్మారెడ్డి విద్యాసంస్థలను ఉద్దేశించి చేసిన సోషల్ మీడియా కామెంట్ ప్రభుత్వంలో కూడా చర్చగా మారింది. అదే సమయంలో అటవీ ఉద్యోగులను ఉద్దేశించి ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు మాట వినడం లేదనడం కూడా వివాదమైంది. ఇప్పుడు బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాటలు కూడా వివాదమే అయ్యాయి.
ఇప్పుడు బొల్లం మాటలతో మళ్లీ..?
తాజాగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ మంట పుట్టిస్తున్నాయి. అసలు హైకోర్టు న్యాయవాదుల హత్యతో అగ్గి మండుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలే సుప్రీం అంటూ మల్లయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో పోలీసులు… అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టే నడుస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపణలుండగా ఎమ్మెల్యే బొల్లం వాటికి బలం చేకూర్చుతూ ఎమ్మెల్యేలు చెప్పిన పోలీసులే, తాసీల్దార్లే ఉంటారని, ఎమ్మెల్యేలే సుప్రీం అని, మాట వినకుంటే తట్టా బుట్టా సర్ది పంపిస్తామంటూ వ్యాఖ్యానించాడు. దీంతో మళ్లీ గులాబీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో హీట్ పెంచాయి.
గతంలో కూడా ఇబ్బందులు పడ్డారు కదా…!
సొంతపార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం టీఆర్ఎస్ పార్టీకి తెచ్చిన ఇబ్బందులు గుర్తించిన అధినేత కేసీఆర్ పలువురిని హెచ్చరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే స్థాయిలో ప్రజల నుంచి దెబ్బతిన్నవారు కూడా ఉన్నారు. గతంలో అప్పుడు ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులపై రెచ్చిపోయి మాట్లాడిన ఆడియో రచ్చ అయింది. గువ్వల బాలరాజు, సుధీర్ రెడ్డి, బొడిగే శోభ, చిన్నయ్యతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు జనాలు, కిందిస్థాయి నేతలు, అధికారులతో మాట్లాడిన మాటలన్నీ వారికి ఎంతో వ్యతిరేకతను పెంచాయి. దీంతో పలువురు ఓటమిపాలయ్యారు. అప్పుడు మంత్రిగా చేసిన జూపల్లి కరీంనగర్ జిల్లా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో గట్టిగా మాట్లాడిన ఆడియో టేపు కూడా రచ్చరచ్చ అయింది.
నేతల తీరుతో తలబొప్పి కడుతోందా?
నోటికొచ్చినట్లు అనడం తర్వాత సారీ చెప్పడం గులాబీ నేతలకు పరిపాటిగా మారింది. మొత్తంగా చూస్తే ఈ వివాదాలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. అసలు ఎందుకలా మాట్లాడాల్సి వస్తుందంటూ చర్చించుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్త పడుతారో అంటే ఇంకా ఎక్కువవుతున్నాయి.