దళిత బంధు: నమ్మొద్దంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

by Anukaran |   ( Updated:2021-08-14 11:05:30.0  )
దళిత బంధు: నమ్మొద్దంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
X

దిశ, కమలాపూర్: బీజేపీ నాయకులు, ప్రత్యర్థులు దళిత బంధు పథకంపై అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరూ విశ్వసించవద్దని ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, దళిత జాతి ఆర్థికంగా ఎదగడం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, దీనిలో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గంను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. కానీ, బీజేపీ పార్టీ నాయకులు అక్కడక్కడ దళిత బంధు పథకంపై అపోహలు, అనుమానాలు సృష్టించి ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

దళిత జాతి ఎదగడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదని, బీజేపీ పార్టీ భావజాల సిద్ధాంతం దళితులకు వ్యతిరేకం అని ఆరోపించారు. ఏ ప్రభుత్వం , ఏ నాయకుడు కలలో కూడా చేయని సాహసం సీఎం కేసీఆర్ చేశారని, అధికారులు దళిత బంధు పథకంను ఈ నెల 17వ తేది నుంచి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, హుజరాబాద్‌లోని దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ సజావుగా జరిగితే.. ఈ అనుభవంతో ఇతర నియోజకవర్గాల్లో కూడా విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ నెల 16వ తేదీన హుజురాబాద్ నియోజకవర్గం శాలపల్లి గ్రామంలో జరగబోయే సీఎం భారీ బహిరంగ సభలో లాంఛనంగా ప్రారంభం కానుందని.. ఈ సభకు పెద్ద ఎత్తున దళితులు, ప్రజలు పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జీ పెరియాల రవీందర్రావు, తక్కలపల్లి సత్యనారాయణ, పోరండ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed