వారికి అడ్డాగా రైతు వేదికలు.. వ్యవసాయ అధికారుల్లో ఫుల్ టెన్షన్

by Anukaran |
వారికి అడ్డాగా రైతు వేదికలు.. వ్యవసాయ అధికారుల్లో ఫుల్ టెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలకు తాళాలు వేలాడుతున్నాయి. పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు టార్గెట్‌‌ పెట్టి మరీ రూ.600 కోట్లతో పూర్తి చేసిన ఈ వేదికలు ఇంకా నిరుపయోగంగానే ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రావట్లేదు.

దేశంలో పత్తిని బాగా పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నా సగటు ఉత్పత్తిలో వెనుకబడింది. చాలామంది రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించారు. అవగాహన లేని కొందరు రైతులు విచ్చలవిడి ఎరువులు, పురుగుమందులు వాడుతుండటంతో భూములు నిస్సారమవుతున్నాయి. దీంతో కొత్త సాగు విధానాలు, కొత్త వంగడాలు, పురుగు మందుల వాడకం, విత్తనాల ఎంపిక, సేంద్రియ, ప్రకృతి సేద్యంపై రైతులకు సరైన శిక్షణ ఇవ్వాలని సర్కారు భావించింది. ఇందుకోసం ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్​ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,604 రైతు వేదికలను నిర్మించింది. ప్రతీ క్లస్టర్‌కు రూ.22 లక్షల చొప్పున రూ.573 కోట్లు ఖర్చు పెట్టి గతేడాది సర్పంచులు, కార్యదర్శులను ఉరుకులు పరుగులు పెట్టించి మరీ పూర్తి చేయించింది.

రైతుల అవగాహన కార్యక్రమాల రద్దు..

రైతు వేదికలను నిర్మించిన ప్రభుత్వం.. అన్నీ ఇక్కడి నుంచే అంటూ గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. ప్రస్తుతం యాసంగి సాగుపై చాలా అనుమానాలున్నాయి. అసలు ఏ పంటలు వేయాలనే అంశంపై రైతులు ఎటూ తేల్చుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వం వరిసాగు వద్దంటూ నిక్కచ్చిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా.. ఆ ప్రయత్నాలే జరగడం లేదు. ఎక్కడా రైతులకు శిక్షణ ఇవ్వట్లేదు. 2014కు ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ సీజన్​ప్రారంభంలో ప్రభుత్వం ఊరూరా ‘రైతు చైతన్య యాత్ర’ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించేది.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ పేరుతో ఏడాది పాటు అలాంటి సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకుంది. తర్వాత రైతు వేదికలు నిర్మించి రైతులకు పంటల సాగులో సూచనలిస్తామని, దేశంలోనే గొప్ప రైతులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. వాస్తవానికి రైతుల మీటింగులే కాకుండా ఏఈవోలు కూడా ఇక్కడి నుంచే పనిచేయాలని ప్రభుత్వం పేర్కొన్నది. భూసార పరీక్షలకు సైతం ఇదే కేంద్రంగా ఉండాలన్నారు. కానీ ఏ క్లస్టర్‌‌లోనూ ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఇక భూసార పరీక్షలు అయితే అసలే చేయడమే లేదు.

టీఆర్ఎస్ మీటింగులకు అడ్డా..

రాష్ట్రంలోని రైతు వేదికలు కేవలం అధికార పార్టీ కార్యక్రమాలకే వాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల సమావేశాలు, పార్టీ మీటింగులన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఖమ్మం జిల్లా ముల్కలపల్లిలో రైతు వేదికను అద్దెకు ఇస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అలా అధికారుల ఇష్టారాజ్యం కాదని, రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు. కానీ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనలు ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం అధికార పార్టీకి మంచి వేదికలుగా మారుతున్నాయి. ప్రతినెలా ఏదో ఓ కార్యక్రమానికి గులాబీ జెండాలతో వేదికలు నిండిపోతున్నాయి. దీంతో వ్యవసాయాధికారులు ఇక్కడి నుంచి విధులు నిర్వర్తించేందుకు ఒకింత భయపడుతున్నారు. కాగా దీనిపై సమాధానం చెప్పేందుకు అధికారులు, రైతుబంధు సమన్వయ సమితిల నుంచి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.

Advertisement

Next Story

Most Viewed