నిమ్స్‌లో చికిత్స అందించాలి

by Shyam |
నిమ్స్‌లో చికిత్స అందించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ నియంత్రణ, విధి నిర్వహణలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారని, వారికి నిమ్స్‌లో నాణ్యమైన చికిత్స అందించాలని కోరుతూ వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటలకు టెస్రా నాయకులు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన తహసీల్దార్ మల్లేశం సీరియస్ కండిషన్‌లో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెంటిలేటర్‌తో కూడిన బెడ్ దొరకక గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం రెవెన్యూ వర్గాలలో ఆందోళన కల్గిస్తుందని మంత్రికి వివరించారు. వీఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు కరోనా కట్టడిలో వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో పాటు ముందు వరుసలోనే ఉన్నారన్నారు. కరోనా వైరస్ సోకిన కొందరు రెవెన్యూ ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి యాజమాన్యాలు వేసే బిల్లులు చెల్లించలేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తహశీల్దార్ విషయాన్ని చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏలకు వివరించామని, వెంటిలేటర్ తో కూడిన బెడ్ సదుపాయాన్ని కల్పించాలని కోరినా ఏ మాత్రం స్పందించలేదని ఆరోపించారు. దీనికి మంత్రి ఈటల స్పందిస్తూ రెవెన్యూ ఉద్యోగులకు నిమ్స్‌తో పాటు టిమ్స్‌లో సరైన చికిత్సకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె.రామకృష్ణ ఉన్నారు.

Advertisement

Next Story