- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS నేతల వేధింపులు.. చెప్పింది చేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి..
దిశ ప్రతినిధి, ఖమ్మం : ఉద్యోగులపై అధికార పార్టీకి చెందిన నేతల పెత్తనం రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్రమాలకు సహకరించాలంటూ కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక వారు అయోమయంలో పడుతున్నారు. వారు చెప్పిన పనులకు ఔననలేక.. కాదనలేక మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం.
అయితే ఈ ప్రాంతంలో గిరిజన చట్టాలను పరిరక్షించాల్సిన అధికార పార్టీ నేతలే అక్రమార్కులకు కొమ్ముకాయడం.. ప్రభుత్వ ఉద్యోగులతో పనులు చేయించుకోవడం పరిపాటిగా మారింది. వీరు చెప్పిన పనులు చేయకపోతే వేధించడం కూడా అదే స్థాయిలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడి భరించలేక కొందరు అధికారులు ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసేందుకు ఇష్టపడటం లేదు. తమకు ట్రాన్స్‌ఫోర్ట్ కావాలంటూ ఉన్నతాధికారులను సైతం కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అక్రమాలకు సహకరించాలంటూ..
పినపాక నియోజకవర్గంలో 1/70యాక్ట్ అమలులో ఉండగా ఈ ప్రాంతంలో అక్రమార్కులు బహుళ అంతస్తులు నిర్మించడం, అనుమతులు లేకుండా భవంతులు కట్టడం, రియల్ వెంచర్లు, ప్రభుత్వ భూముల కబ్జా.. ఇలా ఒకటేమిటి.. రకరకాల అక్రమాలకు తెరతీయడమే కాదు.. వాటి అనుమతుల కోసం ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో దాదాపు అన్ని మండలాల్లో నాయకుల పెత్తనం జోరుగా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ వారు సహకరించాలంటూ జోక్యం చేసుకునే వారు కొందరైతే.. మా పనులు చేసిపెట్టాల్సిందే అని హుకుం జారీచేసే వారు ఇంకొందరు.. ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటం గమనార్హం. మండల స్థాయిలో వినకుంటే తమకు పెద్దల అండదండలు ఉన్నాయంటూ జిల్లా స్థాయి అధికారులతో సైతం కొందరు రికమండేషన్ చేపిస్తూ పనులు చేయించుకుంటున్నారు.
లేకుంటే వేధింపులే..
అధికార పార్టీకి చెందిన నేతలు కాబట్టి తమ పనులు చక్కబెట్టాల్సిందేనని ప్రభుత్వ కార్యాలయాల్లో వారి అనుచరులు తిష్టవేయడం గమనార్హం. తమ పనులు చేసి పెడితే సరి లేకుంటే.. ప్రభుత్వ ఉద్యోగులపై వేధింపుల పర్వం మొదలవుతోంది. తమకు పలుకుబడి ఉదంటూ.. మీ సంగతి చూస్తానంటూ బెదిరించడం పరిపాటిగా మారిందని ఓ మండలస్థాయి అధికారి ‘దిశ’ ప్రతినిధితో చెప్పడం గమనార్హం. జిల్లా స్థాయి అధికారులతో సైతం చెప్పిస్తారని, వారు చెప్పినా వినకుంటే శాఖా పరంగా రకరకాల ఇబ్బందులకు గురిచేయడమో, లేక అర్ధాంతరంగా బదిలీ చేయడమో జరుగుతుందని ఆయన వాపోయారు.
ఉండలేమంటూ..
ఇక అధికార పార్టీకి చెందిన నాయకుల పెత్తనం భరించలేక కొందరు ప్రభుత్వ అధికారులు స్వయంగా తమకు ఈ ప్రాంతం నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ ఫర్ చేయాంటూ ఉన్నతాధికారుల వద్ద వేడుకుంటున్నట్లు తెలిసింది. వారు చెప్పినట్లు చేస్తే అక్రమార్కులకు సహకరించినట్లు అవుతుందని, అది తప్పుకాగా.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని సదరు ఉద్యోగి చెబుతున్నారు. ఒక వేళ చేయకుంటే అధికారపార్టీ నాయకుల నుంచే కాక తమ ఉన్నతోద్యోగులనుంచి కూడా ఒత్తిడి ఉంటుందని మరో ఉద్యోగి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయడం కత్తిమీద సాములాగా ఉందని, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఏది ఏమైనా ప్రశాంతంగా ఇక్కడ ఉండలేకపోతున్నామని తమను మరేదైనా ప్రదేశానికి బదిలీపై పంపిచాలంటూ వేడుకోవడం అధికార పార్టీ నేతల పెత్తనానికి పరాకష్టగా నిలుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.
రేగా సార్.. మీరు దృష్టిపెట్టాల్సిందే..
అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులే ఎక్కువగా అక్రమార్కులకు వత్తాసు పలకడం, వారికి సహకరించాలంటూ వేధింపులకు గురిచేస్తుండటంతో.. వీటన్నింటిపై నియోజకవర్గ ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు దృష్టిపెట్టాల్సిందేనని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కొందరు రేగా కాంతారావు పేరు చెప్పి పలు అక్రమాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆయన అనుచరులు సైతం పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్న విషయం గతంలో ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడుకూడా ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీకి చెందిన వారే వేధిస్తుండడంతో ఆయన ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా రేగా కాంతారావు ఈ విషయంపై దృష్టి పెట్టకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు నియోజకవర్గ ప్రజలు.