మంగళంపల్లి కల నెరవేరేనా..? టీఆర్ఎస్ అధ్యక్ష పీఠంపై ఆశావహుల టెన్షన్

by Shyam |   ( Updated:2021-09-29 02:58:22.0  )
మంగళంపల్లి కల నెరవేరేనా..? టీఆర్ఎస్ అధ్యక్ష పీఠంపై ఆశావహుల టెన్షన్
X

దిశ, తొర్రూర్ : తెరాస జిల్లా కమిటీలు ఈనెల 30 వరకు పూర్తి కావాల్సి ఉండగా జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లా అధ్యక్షుడుగా ఎవరిని ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయాలు స్వీకరించడం, సమన్వయం చేసినటువంటి దాఖలాలు నేటికీ కనిపించడం లేదు. దీంతో సమర్ధత కలిగి అందరినీ కలుపుకుపోయి పనిచేసే వ్యక్తికి పదవిని కట్టపెడుతారో.. ఆర్థిక బలం కలిగిన వ్యక్తికి పదవి కట్టబెడుతారో అని ఒకింత చర్చ జరుగుతోంది. పాలకుర్తి నియోజకవర్గం నుండి రెండు మండలాలు, ఇల్లందు నియోజకవర్గం నుండి రెండు మండలాలు, ములుగు నియోజకవర్గం నుండి రెండు మండలాలు కలుపుకుని పూర్తి స్థాయిలో డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల మండలాలతో మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఏఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరికీ వారు తమతమ ప్రాతినిధ్యం చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారనడంలో సందేహం లేదని చెప్పుకుంటున్నారు.

ద్వితీయ శ్రేణి నోట మంగళంపల్లి మాట..

మహబూబాబాద్ జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారిగా తెరాస జిల్లా అధ్యక్ష ఎన్నిక జరుగుతుండటంతో అనేక మంది నాయకులకు ఆశలు, అంచనాలు పెరిగాయని చెప్పుకోవచ్చు. అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్ భద్రయ్య పేర్లతో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంగళంపల్లి శ్రీనివాస్‌లు ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇదిలాఉండగా జిల్లాలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు తొర్రూరు మండలానికి చెందిన మంగళంపల్లి శ్రీనివాస్‌ను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమం నుండి మంగళంపల్లి శ్రీనివాస్ టీఆర్ఎస్‌లో ఉంటూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. విస్తృత పరిచయాలు కలిగిన ఆయన తొర్రూరు జడ్పీటీసీగా, మహబూబాబాద్ జడ్పీ‌ ప్లోర్ లీడర్‌గా కొనసాగుతున్నాడు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అనుచరుడైన శ్రీనివాస్ ఇప్పటికే జిల్లాలో గిరిజన శాఖామంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మానుకోట ఎంపీ కవితను కలిసి జిల్లా అధ్యక్షుడుగా తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించగా వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు, దళితులపై ప్రత్యేక దృష్టి సారించడం మంగళంపల్లి శ్రీనివాస్‌కు మరింత కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే, అధ్యక్షుడు ఎవరనే నిర్ణయం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీ అధినేత నేరుగా సీల్డ్ కవర్‌లో పంపిస్తారా..? అని మరోవైపు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story