కారుకు పట్టభద్రుల బ్రేకులు.. ప్లీజ్ వద్దంటున్న నేతలు!

by Anukaran |
కారుకు పట్టభద్రుల బ్రేకులు.. ప్లీజ్ వద్దంటున్న నేతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ ఎన్నికలపై అధికార పార్టీ మినహా… మిగతా పార్టీలన్నీ పోటీకి సిద్దమయ్యాయి. అభ్యర్థులు కూడా ప్రచారం మొదలుపెట్టారు. కానీ అధికార పార్టీ నుంచి మాత్రం పోటీదారులు కష్టమవుతున్నారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకే వణుకుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పట్టబద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తున్నాయి. దీంతో వాటికి ఎన్నికలు నిర్వహించడం అనివార్యమవుతోంది. ప్రస్తుతానికి ఒక స్థానం టీఆర్​ఎస్​, ఇంకో స్థానం బీజేపీ ఖాతాలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగింది. విద్యావంతులు, ప్రభుత్వ, ప్రైవేట్​ ఉద్యోగ వర్గాల్లో ఇంకొంత ఎక్కువగానే వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతామనే భయం అధికార పార్టీలో నెలకొంది. దీంతో పోటీ చేసేందుకే వెనకాడుతున్నారు. సిట్టింగ్​ స్థానం టికెట్​ను కూడా వద్దని చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గతంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన ఉద్యోగ సంఘం నాయకుడు దేవిప్రసాద్ ఓడిపోయారు. బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు ఇక్కడ విజయం సాధించారు. మండలి ఏర్పాటు తర్వాత ఈ స్థానంలో ఇప్పటివరకూ టీఆర్ఎస్ గెలిచింది లేదు. దీంతో ఈసారి ఎలాగైన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఈ స్థానం కోసం పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన నేత కావడంతో గ్రాడ్యుయేట్స్‌లో బొంతు రామ్మోహన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంటుందని.. ఉస్మానియా వర్సిటీతో ఆయనకున్న సత్సంబంధాలు కూడా కలిసొస్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే బొంతు రామ్మోహన్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ కోసం మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డినే బరిలో దింపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆయనే ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాకుంటే ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ ఛైర్మన్​ కారం రవీందర్​రెడ్డి పేరును పరిశీలనలో తీసుకున్నారు.

మాకు టికెట్​ వద్దు..

టీఆర్​ఎస్​ నుంచి ఈ రెండు స్థానాలపై పోటీ చేసేందుకు అభ్యర్థులు సాహసించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఎంత చేసినా..గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇటీవల అభ్యర్థులు నిర్వహించుకున్న ప్రాథమిక సర్వేలోనే వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రైవేట్​ ఉద్యోగులు ఎక్కువగా ఉంటే ఈ రెండు మండలి సెగ్మెంట్లలో వ్యతిరేకత ఓట్లే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రైవేట్​ ఉద్యోగుల తరుపున టీపీటీఎఫ్​ విస్తృతమైన పాదయాత్ర చేస్తోంది. వామపక్షాలు కూడా అభ్యర్థులు రంగంలోకి దింపి ప్రచారంలో మునిగాయి. అటు ప్రొఫెసర్​ కోదండరాం కూడా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణవాదులు ఆయనకు మద్దతు పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేయడం సాహసమేననే చెప్పుకుంటున్నారు. దీంతో పల్లా రాజేశ్వర్​రెడ్డిని మళ్లీ బరిలోకి దిగాలని చెప్పుతున్నా… ఆయన వెనకడుగు వేస్తున్నారు. ఈసారి పోటీ చేయలేమంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్​కు సైతం విన్నవించుకున్నారు. ఉద్యోగ సంఘాల మాజీ నేత కారం రవీందర్​రెడ్డి కూడా పోటీకి దూరంగా ఉంటున్నారు. ఆయన్ను పోటీ చేయాలని ఇప్పటికే సూచించినా… ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన ఎస్​ఆర్​ విద్యాసంస్థ అధినేత వరదారెడ్డిని మరోసారి పరిశీలనలోకి తీసుకుంటున్నారు. కానీ వరదారెడ్డి కూడా ఇంకా అభిప్రాయం చెప్పలేదు.

ఓడిపోతే ఏమిస్తారు..?

హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా అభ్యర్థి దొరకడం లేదు. బొంతు రామ్మోహన్​ను అనుకున్నప్పటికీ..ఓటమి భయంతో ముందుగానే కొన్ని హామీలు కోరుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించాయి. తన భార్యకు మేయర్​ స్థానం, ఓడిపోతే నామినేటెడ్​ పదవి ఇవ్వాలని, అలాగైతే పోటీ చేస్తానని చెప్పుకున్నారు. దీంతో ఇక్కడ ఇంకా అభ్యర్థి ఖరారు కావడం లేదు. బీజేపీ మళ్లీ రామచంద్రారావునే దింపాలని భావిస్తోంది. కానీ ఇంకా ఫైనల్​ చేయలేదు. ఒకవేళ రామచంద్రారావును ఒప్పించి స్వామిగౌడ్​కు అవకాశం ఇవ్వాలని కూడా ఓ ప్రతిపాదన పెట్టారు. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

పార్టీ తరుపున వద్దు..

ఈ పరిణామాల్లో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరీంనగర్​ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడింది. జీహెచ్​ఎంసీలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కష్టమని ముందుగానే తేలింది. అసలు అభ్యర్థులే వెనకడుగు వేస్తున్నారు. దీంతో టీఆర్​ఎస్​ పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకుండా పోటీకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ రెండు సెగ్మెంట్లలో ప్రజాప్రతినిధులు అభ్యర్థుల వెంట ఉంటారని, కానీ పార్టీ తరుపున మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్​ స్థానంలో ఆ ప్రయోగం చేసి ఘోరంగా విఫలమయ్యారు. కరీంనగర్​ స్థానం నుంచి గ్రూప్​‌‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్​గౌడ్​ను బరిలోకి దింపి, పార్టీ తరుపున ప్రకటించలేదు. ప్రజాప్రతినిధులను సహకారం చేయాలని చెప్పినా… ఒక్కచోట కూడా ఓటేయాలని చెప్పలేదు. దీంతో చంద్రశేఖర్​గౌడ్​… కాంగ్రెస్​ నేత జీవన్​రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలాంటి పరిణామాలను కూడా టీఆర్​ఎస్​ బేరీజు వేసుకుంటోంది.

మరోవైపు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి వరంగల్​ నుంచి కోదండరాం, రాణీ రుద్రమ, సారథి, టీపీటీఎఫ్​ నుంచి షబ్బీర్​తో పాటు పలువురు ప్రచారాన్ని సాగిస్తున్నారు. హైదరాబాద్​ స్థానానికి కాంగ్రెస్​ నుంచి వంశీచంద్​, బీజేపీ నుంచి రామచంద్రారావుతో పాటు అటు ప్రొఫెసర్​ నాగేశ్వర్​ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎన్నికలంటే ముందుగా ఉండే టీఆర్​ఎస్​ మాత్రం ఇప్పుడు వెనకబడుతోంది. కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులున్నాయి. పార్టీ తరుపున అధికారికంగా అభ్యర్థులను దింపేందుకు కూడా గులాబీ శ్రేణులు ఆలోచనలో పడ్డారంటే పరిస్థితులు ఎలా మారాయో అర్థమవుతోంది.

Advertisement

Next Story