- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క చాన్స్ ప్లీజ్..!
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక హడావుడి మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే పల్లెలు, పట్టణాల్లో రాజకీయ వేడి రగులుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్లను ఓటర్లగా నమోదు చేసేందుకు ఆశావహులు రంగంలో దిగుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. గ్రామాల్లో సర్పంచ్, పార్టీ అధ్యక్షులు, పట్టణాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు డివిజన్ అధ్యక్షులు బాధ్యతలు తీసుకునేలా ఆయా పార్టీల నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటగా గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటరు నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని పార్టీలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే పార్టీల నాయకులు ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదుతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
టీఆర్ఎస్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జిల్లాల్లోని నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా నుంచి పార్టీ ప్రారంభం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల వసతుల కల్పన చైర్మన్ నాగేందర్ గౌడ్, పార్టీ మొదటి నుంచి పనిచేస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శుభప్రద్ పటేల్‌తో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి సైతం పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వీరందరూ అధిష్టానానికి విన్నవించుకున్నట్లు సమాచారం. కానీ, సీఎం కేసీఆర్ ఎవరి పేరు ప్రకటిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ ఆశించిన అభ్యర్థులకు దక్కుతుందా లేదా వేచి చూడాల్సిందే.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకుని సదస్సులు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేడ్చల్ జిల్లాను మంత్రి మల్లారెడ్డి సమన్వయం చేయాలని సూచించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ బరిలో నిలిచి ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని దూకుడుగా ముందుకు పోతుంది. అంతేకాకుండా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలను రంగంలోకి దింపింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ మాజీ మంత్రులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు పోటీకి సై అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధిష్టానం ఈ ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆశావహులు కాంగ్రెస్ హైకమాండ్‌కు తమ బయోడేటాలను పంపినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తనకే ఛాన్స్వస్తుందని ఓటర్ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపించినట్లు సమాచారం. రాంమోహన్ రెడ్డికి ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో చదివిన విద్యార్థులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే ఉన్నారని, తనకు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల యాజ మాన్యం సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో తనకు అవకాశం కల్పిస్తే గెలుస్తానని అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అంతర్గత అవగాహన సదస్సులు ప్రారంభించింది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్ రావు అనుకూల వ్యక్తుల ఇళ్లకు వెళ్లి కలిసి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని బీజేపీ వ్యూహం చేస్తోంది. మేధావులు, విద్యావంతులు, పార్టీలకు అతీతంగా నాయకులను కలిసి టీఆర్ఎస్ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను బీజేపీ నాయకులు వివరిస్తున్నారు.
ప్రజా సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు. వ్యక్తిగతంగా పలువురితో మంచి సంబంధాలు, సమాజంపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా అందరికి సుపరిచితుడుగా పేరుంది. అంతేకాకుండా వామపక్షాలు, ప్రజాసంఘాలు పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.